ఏదో ఒక రోజు పోలీస్ అవ్వాలని కలలు కన్నదో యువతి. అయితే అనుకోకుండా ఆమెకు క్యాన్సర్ సోకింది. ఎట్టకేలకు ఒక రోజు పోలీస్ అవ్వాలన్న తన కలను నెరవేర్చుకుంది.
ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. ఆ కల కోసం ఎంతవరకైనా పోరాడతారు. కొందరికి డాక్టర్ అవ్వాలని, కొందరికి కలెక్టర్ అవ్వాలని, కొందరికి పోలీస్ అవ్వాలని ఇలా రకరకాల కలలు ఉంటాయి. ఈ కల నేర్చుకునే క్రమంలో ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు. రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతుంటారు. తండ్రి లేకపోయినా పని చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు. ఇలా ఏదో రకంగా ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా కూడా అనుకున్నది సాధిస్తారు. అయితే కొందరికి అనుకున్నది సాధించడానికి కాదు, సాధించాలి అని అనుకోవడానికి కూడా అవకాశం ఉండదు. భయంకరమైన ప్రాణాంతక వ్యాధికి గురైతే వారు మాత్రం ఏం చేయగలరు. బతుకు మీద ఆశ చనిపోతుంది. కానీ కల మీద ఆశ మాత్రం చచ్చే వరకూ వెంటాడుతుంది.
ఒక యువతికి పోలీస్ అవ్వాలని కోరిక బలంగా ఉంది. కానీ ఆరోగ్యం ఆమెకు సహకరించలేదు. క్యాన్సర్ కారణంగా ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది. కూతురికి క్యాన్సర్ అని తెలిసి తండ్రికి పక్షవాతం వచ్చింది. తల్లి ఒక్కర్తే ఇద్దరినీ చూసుకుంటుంది. ఇటువంటి సమయంలో స్వాతికి (23) జీవితం మీద ఆశ చనిపోయింది. ఇక పోలీస్ అవ్వాలన్న తన కోరిక నెరవేరదేమో అని చాలా బాధపడింది. కానీ ఆమె కోరికను సూర్యాపేట జిల్లా పోలీసులు నెరవేర్చారు. మేక్ ఏ విష్ ప్రోగ్రాంలో భాగంగా స్వాతి కోరికను నెరవేర్చారు. క్యాన్సర్ తో పోరాడుతున్న స్వాతి కోరిక మేరకు స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆమెను ఒకరోజు పోలీస్ గా నియమించి ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.
ఈ సందర్భంగా స్వాతి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురవ్వడంతో పాటు తనకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించింది. ఇక పోలీస్ ని అవ్వనేమో అనుకున్నాను, కానీ పోలీసులు నన్ను ఒకరోజు పోలీస్ గా నియమించి తన కలను నిజం చేశారంటూ భావోద్వేగానికి గురయ్యింది. ఈ ధైర్యంతో ఇంకా కొన్ని రోజులు జీవిస్తానని, ఆ నమ్మకం ఉందని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఏదో ఒక రోజు పోలీస్ అవ్వాలని కలలు కన్న యువతి ఒక రోజు పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తించడంపై, అలానే క్యాన్సర్ బాధిత యువతి కోరికను నెరవేర్చిన పోలీసులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే ఈ యువతి క్యాన్సర్ మహమ్మారిని జయించి మునుపటిలా సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుందాం.