సరైన సమయంలో వైద్య సేవలు అందకుంటే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలే నిండు ప్రాణాలు తీస్తాయి. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన విషయంలో ఈ మరణాలు మరీ ఎక్కువగా చూస్తుంటాం. రోగానికి వైద్యం, మందులు ఉండి కూడా అవి అవసరమైన సమయంలో అందక ఎందరో గిరిజన బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. చిన్నపాటి వర్షాలకు వాగులు పొంగడంతో సరైన వంతెనలు లేక రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. ఆస్పత్రికి చేరేందుకు సరైన మార్గమో, వాహనమో లేకనే గిరిజనులు సాధారణ జ్వరాలతో చనిపోతుంటారు. గర్భిణులు ప్రసవ వేదన అనుభవిస్తూ సమయానికి ఆస్పత్రి చేరేలోపే బిడ్డతో సహా కన్నుమూస్తున్నారు. ఇలాంటి ఎన్నో హృదయ విదారక ఘటనలు విన్నాం, చూశాం.
గిరిజనులకు శాపంగా మారిన మౌళిక వసతుల లేమి సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వాలదే. చాలా సందర్భాల్లో ఈ సమస్య పరిష్కారానికి పాలకులు తమ ఆలోచనలు, ప్రణాళికలను తెలియజేశారు. వాటి అమలు విషయంలో మాత్రం చెప్పిన దానికి వాస్తవానికి చాలా తేడా ఉండడంతో ప్రభుత్వం అభాసుపాలు అవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఏడ్లబండి అంబులెన్స్. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందజేసేందుకు వైద్యారోగ్య శాఖ ఏడ్లబండి అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. వైద్య సేవలు అవసరమైన వ్యక్తి వద్దకు కాకుండా రోడ్డు మార్గం సవ్యంగా ఉన్నంత వరకు మాత్రమే సాధారణ అంబులెన్స్‌లు వస్తాయి.
అక్కడికి బాధితులను చేర్చేందుకు గ్రామస్తులు ఎన్నో పాట్లు పడతారు. మంచంతో సహా బాధితులను నలుగురు కలిసి ఎత్తుకెళ్లడమో, చేతులపై మోసుకెళ్లడమో చేస్తుంటారు. ఈ ఇబ్బందులను తగ్గించేందుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎడ్లబండి అంబులెన్స్ లను ఏర్పాటు చేసినట్లు స్వయంగా వైద్యారోగ్య శాఖ అధికారి తెలపడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞానం ఇంతలా అభివృద్ధి చెందుతున్న నేటి ఆధునిక ప్రపంచంలో కొన్ని ఏళ్లనాటి క్రితం కనుగొన్న ఎడ్లబండిని మనతో పాటు జీవిస్తున్న గిరిజనుల ప్రాణాలు రక్షించేందుకు ఉపయోగించడం విమర్శలకు దారి తీస్తోంది. గాల్లో ఎగిరే అంబులెన్స్‌లను గిరిజనుల కోసం తీసుకొస్తాం అనే వాగ్ధానాలు విన్న రాష్ట్రంలోనే ఇలాంటి ఎడ్లబండి అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.