విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం యొక్క అభివృద్ధి పుస్తకంలో మరో అధ్యాయం చేరనుంది. హైదరాబాద్ లో కూడా బుల్లెట్ రైలు పరుగులు పెట్టే సమయం త్వరలోనే రాబోతుంది. దీని కోసం కేంద్రం కసరత్తులు చేస్తోంది. ముంబై-హైదరాబాద్ నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుని వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణ, రైల్వే ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్ హై స్పీడ్ రెయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు.. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించగా.. ఈ ప్రాజెక్టుకి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని కోసం థానే జిల్లాలో భారీగా భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఇక తెలంగాణలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున భూసేకరణ అవసరమవుతుందన్న ప్రతిపాదనతో రైల్వే ప్రాజెక్టు అధికారులు.. సంగారెడ్డి కలెక్టరేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ గురించి అధికారులతో చర్చించారు. త్వరలోనే ఏరియల్ సర్వే చేసి.. డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. డీపీఆర్ ఆమోదం పొందితే.. త్వరలోనే ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే.. 3 గంటల్లోపు ముంబై వెళ్లిపోవచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. హైదరాబాద్, ముంబైల మధ్య ఉన్న దూరం 700 కిలోమీటర్లు పైనే ఉంది. ప్రస్తుతం అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్న రైళ్లు ముంబై చేరుకోవడానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది. దీంతో బుల్లెట్ రైలు వస్తే 3 గంటల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చునని భావిస్తున్నారు.
రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలో మొత్తం 8 బుల్లెట్ రైలు మార్గాలను ప్రతిపాదించగా.. వీటిలో ముంబై-పూణే-హైదరాబాద్ మార్గం ఒకటి. ముంబై-పూణే-హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గంలో మొత్తం 11 స్టేషన్లు రానున్నాయి. వీటిలో నేవీ ముంబై, లోనవల, పూణే, బరమతి, కుర్కుంబ్, అక్లుజ్, పంధర్పూర్, సోలాపూర్, కలబురగి (గుల్బర్గా), వికారాబాద్, హైదరాబాద్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణా సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు, మహారాష్ట్రలోని థానే మధ్య హై స్పీడ్ ట్రాక్ ని నిర్మించాల్సి ఉంటుంది. బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. ప్రస్తుతం ఉన్న ట్రాకులు ఈ వేగాన్ని తట్టుకోలేవు. అందుకే ప్రత్యేకంగా ట్రాకుని నిర్మించనున్నారు. ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రతిపాదించిన మార్గంలో 70 శాతం హై స్పీడ్ రైలు కారిడార్ ఉంది.
ఈ ప్రాజెక్టుకి మొత్తం 1198 ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని నేషనల్ హై స్పీడ్ రెయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది. తొలుత 10 కోచ్ లతో బుల్లెట్ రైలుని ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ముంబై, హైదరాబాద్ నగరాల మధ్య ఏరియల్ డిస్టన్స్ 621 కిలోమీటర్లు ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం అధికారులు తాండూర్, వికారాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. 11 స్టేషన్లను కనెక్ట్ చేస్తూ.. గూగుల్ మ్యాపింగ్ పూర్తి చేశాక.. మరోసారి ఏరియల్ సర్వ్ నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టుకి లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య తొలి బుల్లెట్ రైలుని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. టెండర్లను కూడా ఆహ్వానించారు. 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.