టీఆర్ఎస్ ప్లీనరీతో హైదరాబాద్ గులాబీమయం అయ్యింది. హైటెక్స్‌లో నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ ప్లీనరీకి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అంతకు ముందు ప్లీనరీ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తనను పార్టీ అధినేతగా ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని.. పాలన చేతకాదని, భూముల ధరలన్నీ పడిపోతాయని దుష్ప్రచారం చేశారు. ఏడేళ్ల పాలనలో ఆ అపోహలన్నీ పటాపంచలు చేశాం. గతంలో ఉపాధికోసం పాలమూరు నుంచి ముంబయి వలస వెళ్లేవారు. ఇప్పుడు పాలమూరుకి వస్తున్నారు. మన పథకాలను చూసి ఎంతో మంది మెచ్చుకుంటున్నారని అన్నారు. ఇక దళితబంధును ఆపేది నవంబర్ 4 వరకేనని.. ఆ తర్వాత ఎవరు ఎన్ని అడ్డంకాలు తీసుకు వచ్చినా ఆగే ప్రసక్తి లేదని అన్నారు.
డిసెంబర్ నాటికి హూజూరాబాద్ లో దళితబంధులను వంద శాతం అమలు చేస్తామని చెప్పారు. మనం తీసుకు వస్తున్న పథకాలకు ఇతర రాష్ట్ర ప్రజలు, నాయకులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇక దళితబంధు పెట్టిన తర్వాత ఏపీ నుంచి వేలాది విన్నపాలు వస్తున్నాయని… ఆంధ్రలో కూడా పార్టీని పెట్టండి, గెలిపించుకుంటామని అంటున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన వేలాది మంది కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారని అన్నారు.
తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్లు పక్క రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయని తెలిపారు. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. కొన్ని రాజకీయ శక్తులు రక రకాల కుట్రలు పన్నుతున్నారని.. తాను ప్లీనరీలో చేస్తున్న ప్రసంగాన్ని హుజూరాబాద్ ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేస్తుందని తెలిపారు.
