ఈ మద్య డబ్బు సంపాదించడానికి కొంత మంది సులువైన మార్గాలు ఎన్నుకుంటున్నారు. అందులో ఒకటి ఏటీఎం కొల్లగొట్టడం. ఇలా దొంగలు ఎంతో చాకచక్యంగా దొంగతనాలకు పాల్పపడుతూ.. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటారు. సాధారణంగా దొంగతనం చేసే సమయంలో ఏ సమస్యలో చిక్కుకున్న వెంటనే మధ్యలోనే ఆపనిని ఆపేసి అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఒక దొంగ మాత్రం ఏటీఎంలో చోరి చేస్తుండగా అలారం శబ్ధం వస్తున్న తన దొంగతనం ఆపలేదు. చివరికి పోలీసులకు చిక్కి కటకటల పాలైనాడు.
వివరాల్లోకి వెళ్తే….నిజామాబాద్ నగర పాలక సంస్థలోని పారిశుద్ధ్య విభాగంలోని ఉద్యోగి డిలోడ్ సునీల్. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా సునీల్ పనిచేస్తున్నాడు. నగరపాలికలో పనిచేస్తున్నా…ఇతను స్థానిక పద్మనగర్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి చోరికి యత్నించాడు. ఇనుపరాడ్డును ఉపయోగించి ఏటీఎంను తెరచే ప్రయత్నం చేశాడు. ఏటీఎంను పగలగొట్టే ప్రయత్నంలోనే అలారం మోగింది. అయిన అతను తనదొంగతనం మాత్రం ఆపలేదు. ఏటీఎంని ధ్వంసం చేసి డబ్బులు తీసే పనిలో ఉన్నాడు.
స్థానికులు అలారం శబ్ధంకు మేల్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి కూడా అతను డబ్బులు తీసే పనిలో బిజీగా ఉన్నాడు. దొంగతనంలో నిమగ్నమైన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అలారం మోగుతున్న అతను ఎందుకు అక్కడి నుంచి తప్పించుకోలేదనే సందేహం రాకమానదు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే… డిలోడ్ సునీల్ కు మూగ,చెవుడు సమస్య ఉంది. ఉన్న ఉద్యోగంతో హాయిగా ఉండగా ఆశ ఎక్కువై.. చివరుకు కటకటలా పాలయ్యాడు అని చూసిన స్థానికులు అనుకున్నారు.