యూట్యూబ్ లో ఒక్కో వీడియోని లైక్ చేసినందుకు రూ. 50 ఇచ్చారు. అలా రూ. 50 ఇస్తూ ఒక్కరోజులో రూ. 75 లక్షలు సంపాదించారు. వీడియోని లైక్ చేసే జాబ్ ఇచ్చినోడే రూ. 75 లక్షలు సంపాదిస్తే మరి వీడియోలను లైక్ చేసిన వాళ్ళు ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించి ఉంటారో? అని అనిపిస్తుందా? అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
సులభంగా డబ్బు సంపాదించే పనులు దొరికితే బాగుణ్ణు అని ఆలోచిస్తున్నారా? ఏమీ చేయకుండా వీడియోలు చూస్తూ డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారా? యూట్యూబ్ లో వీడియోలకు లైక్ కొడుతూ లక్షాధికారి అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ సువర్ణావకాశం. యూట్యూబ్ లో ఒక వీడియోకి ఒక లైక్ చేస్తే రూ. 50 సంపాదించుకోవచ్చు అని ఎవరైనా చెప్తే మీ రియాక్షన్ ఏమిటి? నిజంగానే డబ్బులు వస్తాయని అనుకుంటున్నారా? నిజంగానే లక్షలు వస్తాయి. అయితే వీడియోని లైక్ చేసిన మీకు కాదు. వీడియోని లైక్ చేయమని చెప్పిన వాడికి వస్తాయి లక్షలు లక్షలు. వీడియోని లైక్ చేయండి, డబ్బు సంపాదించండి అని చెప్పి రూ. 75 లక్షలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు.
హైదరాబాద్ భరత్ నగర్ కు చెందిన ఓ యువకుడి ఫోన్ కి పార్ట్ టైం జాబ్ ఉందని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. పార్ట్ టైం జాబ్ కదా అని ఆ యువకుడు ఆ వాట్సాప్ నంబర్ కి కాల్ చేసి వివరాలు కనుక్కున్నాడు. అయితే ఉద్యోగం వచ్చే లోపు తాము పంపే యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టాలని.. ఒక్కో లైక్ కు రూ. 50 చెల్లిస్తామని ఆశ చూపించారు. కొన్ని రోజుల పాటు ఒక్కో లైక్ కు రూ. 50 చొప్పున ఆ యువకుడికి చెల్లిస్తూ వచ్చారు. యువకుడికి కూడా నమ్మకం పెరిగింది. సర్వీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నమ్మించి పలు దఫాలుగా యువకుడితో రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. హైదరాబాద్ కు వలస వచ్చిన ఒక రైతుకు కూడా ఇలానే జరిగింది. పెట్టుబడి పెడితే కోటీశ్వరులు అవ్వచ్చునని నమ్మించి రైతు నుంచి దఫాలుగా రూ. 25 లక్షలు కాజేశారు. షేక్ పేటకు చెందిన యువకుడికి పార్ట్ టైం జాబ్ పేరుతో రూ. 9 లక్షలు పెట్టుబడి పేరుతో మోసం చేశారు. మలక్ పేట్ కి చెందిన వ్యక్తి నుంచి రూ. 4 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు కాజేశారు.
ఇలా మొత్తం ఆరుగురు వక్తుల నుంచి రూ. 75 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. వీరంతా సోమవారం నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఒక్క రోజులో పెట్టుబడి పేరుతో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కాజేయడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పార్ట్ టైం జాబ్స్ అని, ఒక్కో లైక్ కి రూ. 50 ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత లక్షలు పెట్టుబడి పెట్టించి మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈజీ మనీ పేరుతో జరిగే మోసాలను గ్రహించాలని అంటున్నారు. మరి ఇలాంటి అనుభవం మీకు ఎదురయ్యిందా? అప్పుడు మీరు ఎలా బయటపడ్డారు? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి.