యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ అంటే యూపీఐ అందుబాటులో వచ్చాక పేమెంట్స్ స్వరూపం మారిపోయింది. చెల్లింపులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. అదే సమయంలో డిజిటల్ మోసాలు పెరిగిపోతుండటంతో కీలకమైన ఫీచర్ నిలిచిపోనుంది.
ప్రస్తుతం అందుబాటులో చాలా రకాల యూపీఐ యాప్స్ ఉన్నాయి. అందులో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే ఇలా చాలానే ఉన్నాయి. యూపీఐ చెల్లింపుల్ని కంట్రోస్ చేసేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. యూపీఐ చెల్లింపుల్లో యూజర్ల సౌకర్యం కోసం చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. యూపీఐ చెల్లింపులు పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువౌతున్నాయి. వివిధ రకాల మోసాలతో ప్రజల్నించి డబ్బులు కొట్టేస్తున్నారు. సైబర్ మోసాల నుంచి ప్రజల డబ్బుని రక్షించే క్రమంలో ఎన్‌పీసీఐ కొన్ని ఫీచర్లను యూపీఐ నుంచి తొలగించాలని నిర్ణయించింది.
యూపీఐ చెల్లింపుల్లో రెండు పద్ధతులున్నాయి. నేరుగా వ్యక్తి ఫోన్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయడం ఒకటి. మరొకటి ఎవరికైతే డబ్పులు చెల్లించడం లేదా అవసరమో వారు డబ్బు రిక్వెస్ట్ చేయడం. సాదారణంగా ఈ పద్ధతి ఎక్కువగా వ్యాపారుల వద్ద ఉంటుంది. పేమెంట్ లింక్ పంపిస్తుంటారు. దానిని పిన్ ద్వారా ధృవీకరిస్తే చెల్లింపు పూర్తవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇండివిడ్యువల్ వ్యక్తులకు కూడా ఉంది. కానీ ఈ తరహా చెల్లింపుల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు అధికమయ్యాయి.
అందుకే ఇక నుంచి అంటే అక్టోబర్ 1, 2025 నుంచి యూపీఐ యాప్స్ నుంచి పేమెంట్ లింక్ ఆప్షన్ తొలగించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తి పేమెంట్ లింక్ రిక్వెస్ట్ చేసే గరిష్ట పరిమితి 2 వేల రూపాయలు కాగా రోజుకు 50 సార్లు చేసుకోవచ్చు. కానీ సైబర్ మోసాల నేపధ్యంలో ఈ ఫీచర్ తొలగిస్తున్నారు. ఇకపై ఈ ఫీచర్ కేవలం వ్యాపారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పేమెంట్ లింక్ ఆప్షన్ ఉండదు.