పుట్టింది సంప్రదాయ కుటుంబం.. మొత్తం నలుగురు ఆడప్లిలలే. మూడో సంతానంగా జన్మించిన ఆమెకు తండ్రి మాదిరే క్రీడల మీద ఆసక్తి కలిగింది. తొలుత పరుగుపందెంలో రాణించింది. కానీ కోచ్ సలహా మేరకు బాక్సింగ్‌ను ఎంచుకుంది. అది చూసి బంధువులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకున్నారు. ‘‘హవ్వా.. ఆడపిల్లవు.. ఇలా మగ పిల్లలు ఆడే ఆటలా.. బాక్సింగ్‌లో రాణించాలంటే ఎంత బలం కావాలి.. ఎన్ని దెబ్బలు తట్టుకోవాలి.. ముఖం మీద దెబ్బలు తగిలితే ఇంకేమైనా ఉందా.. అసలు పెళ్లి అవుతుందా’’ అంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. వారందరి మాటలు విని బెదిరిపోలేదు.. భయపడలేదు.. రింగ్‌లో సివంగిలా పంచులు విసురుతూ.. వాటన్నింటిని పటాపంచలు చేసి.. నేడు ప్రపంచ చాంపియన్‌గా ఎదిగింది. ఈ విజయం వెనక ఎంతో కష్టం, ఎన్నో అడ్డంకులు, అవమానాలు. వాటిన్నింటిని దాటుకుని.. నేడు ప్రపంచ చాంపియన్‌గా ఎదిగిన తెలుగమ్మాయి నిఖత్ జరిన్ గురించి ప్రత్యేక కథనమిది..
నిఖత్ స్వస్థలం నిజామాబాద్. ఆమె కెరీర్ ఈ స్థాయికి చేరడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి జమీల్ అహ్మద్ పట్టుదల, సహకారం. నలుగురు అమ్మాయిలలో మూడోదైన నిఖత్‌ను ఆయన తన ఇష్టప్రకారం క్రీడల్లో ప్రోత్సహించాడు. అథ్లెట్‌గా మొదలు పెట్టిన నిఖత్ బాక్సర్‌గా ఎదిగింది. నిజామాబాద్‌లో ప్రముఖ బాక్సింగ్ కోచ్‌గా గుర్తింపు ఉన్న శంషముద్దీన్ ఆమెలో ప్రతిభను చూసి సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పించాడు. దాంతో 13 ఏళ్ల వయసులో ఆటను మొదలు పెట్టిన నిఖత్ ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో పాటు రూరల్ నేషనల్స్‌లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో మూడు నెలలకే జాతీయ సబ్ జూనియర్ స్థాయిలో బెస్ట్ బాక్సర్‌గా నిలిచింది. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ క్యాంప్‌లోకి ఎంపిక కావడంతో నిఖత్‌కు తన భవిష్యత్తు ఏమిటో స్పష్టమైంది.
ఇది కూడా చదవండి: Rinku Singh: రింకూ సింగ్.. మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడు! ఎవరితను?
సాధించిన విజయాలు..
ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచిన టర్కీలోనే నిఖత్ 2011లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా కూడా నిలిచింది. అదే ఆమె విజయాలకు పునాది. ఈ గెలుపుతో జాతీయ బాక్సింగ్‌లో నిఖత్‌పై అందరి దృష్టి పడింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇదే జోరులో యూత్ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్ కప్, థాయిలాండ్ ఓపెన్‌లలో పతకాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో 2019లో స్వర్ణం గెలవడంతో భవిష్యత్ తారగా గుర్తింపు దక్కింది. నెక్స్ట్ టార్గెట్.. ఒలంపిక్స్. దానికోసం ఎంతో కష్టపడుతుంది నిఖత్. అయితే అనుకోకుండా ఒలింపిక్స్‌కు ముందు ఇండియా తరఫున 51 కిలోల కెటగిరీలో ఏ ట్రయల్స్ లేకుండానే మేరీకామ్‌ను ఎంపిక చేశారు. దీనిపై నిఖత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిర్ ట్రయల్స్ కావాలని పట్టుబట్టింది. చాలా మంది ఆమెకు మద్దతు తెలిపారు. ట్రయల్స్ నిర్వహించారు.
ఆ అవమానం పెంచిన కసితో..
‘నిఖత్ జరీన్ ఎవరు’… తనతో పోటీకి సై అన్న ఒక యువ బాక్సర్ గురించి మేరీ కోమ్ చేసిన వ్యాఖ్య ఇది. టోక్యో ఒలింపిక్స్‌కు తనకు నేరుగా అర్హత ఇవ్వాలంటూ మేరీ కోమ్ కోరగా, ట్రయల్స్‌లో ఆమెతో తలపడేందుకు అవకాశం ఇవ్వాలని నిఖత్ విజ్ఞప్తి చేసింది. చివరకు నిఖత్ విజ్ఞప్తి అంగీకరించారు.. కానీ ఈ పోటీలో మేరీకోమ్ చేతిలో ఓటమి ఎదురైంది. పోటీ ముగిసిన తర్వాత కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. దిగ్గజ బాక్సర్‌తో తలపడేందుకు ప్రయత్నించిందంటూ నిఖత్‌పై ప్రతికూల విమర్శలు వచ్చాయి. అలాంటి స్థితి నుంచి ఆమె మళ్లీ పట్టుదలగా పైకి లేచింది. అంతకు ముందు ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరమైంది. కోలుకొని మళ్లీ ఆడగలనో.. లేదో అనే భయం ఉన్నా… ఏ దశలోనూ ఓటమిని అంగీకరించని తత్వంతో దూసుకొచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయంతో పాటు ట్రెండ్జ్ టోర్నీని మరోసారి గెలిచిన నిఖత్… ఇప్పుడు నేరుగా వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.
ఇది కూడా చదవండి: Mushfiqur Rahim: అందరూ నన్ను ‘బ్రాడ్‌మాన్’ అంటుంటారు: ముష్ఫికర్ రహీమ్
సరిగ్గా చెప్పాలంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో ట్రయల్స్‌తో మేరీకోమ్‌తో తలపడి వివాదంలో భాగంగా మారిన తర్వాతి నుంచి ఆమె ‘కొత్త కెరీర్’ను మొదలుపెట్టింది. సీనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తే తప్ప జూనియర్‌గా సాధించిన విజయాలకు విలువ, గుర్తింపు లేదని గుర్తించిన నిఖత్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా నిఖత్ బ్యాక్‌ఫుట్ బాక్సర్. కానీ ఆమె తన ఆటను మార్చుకుంది. ఒక పంచ్ విసరడంతో పాటు వెంటనే మరో కౌంటర్ పంచ్‌తో సిద్ధమైపోయే ఫ్రంట్‌ఫుట్ ఆట ఇప్పుడు ఆమెను ప్రపంచ చాంపియన్‌గా నిలిపింది. ఆమె సాధించిన విజయం పట్ల ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ముందున్న సవాల్ ఇదే…
పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా నిఖత్ సిద్ధమవుతోంది. అయితే ఆమె పతకం గెలిచిన కేటగిరీ 52 కేజీలు ఒలింపిక్స్‌లో లేదు. 50 కేజీలు లేదా 54 కేజీలకు మారాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె సాధన చేయాల్సి ఉంది. ఇక 2024లో నిఖత్ జరిన్ తప్పక పతకం సాధించాలని కోరుకుంటున్నారు. ఇక నిఖత్ జరిన్ సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్ మరణం వెనుక ఆస్ట్రేలియన్ క్రికెటర్! సోషల్ మీడియాలో వార్తలు!