సౌరవ్ గంగూలీ.. టీమిండియాని తన సారథ్యంలో ఉన్నత దశకు తీసుకెళ్లిన గొప్ప ఆటగాడు. ఒకానొక దశలో భారత్ ను చూస్తే.. ప్రపంచ దేశాలు వణికేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే “పాలు పోసిన పెంచిన పాము యజమానినే కాటేసినట్లు.. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు” పడ్డాడు గంగూలీ. ఏరికోరి తెచ్చుకున్న కోచ్.. ఏకంగా గంగూలీ కెరీర్ నే శూన్యంలోకి నెట్టేశాడు. అప్పటికి అద్భతమైన ఫామ్ లో ఉన్న గంగూలీ.. కోచ్ గ్రేగ్ చాపెల్ వల్ల అధఃపాతాళానికి పడ్డాడు. అయితే గ్రేగ్ చాపెల్ వ్యవహారంలో సచిన్ తనను మోసం చేశాడని గంగూలీ ఆరోపించాడు. ముందే తెలిసిన విషయాన్ని సచిన్.. గంగూలీకి చెప్పలేదు. ఏంటా విషయం? గ్రేగ్ చాపెల్ కు గంగూలీకి వివాదం ఎక్కడిది? భారత జట్టు అవసాన దశకు చేరడానికి చాపెల్ చేసిన పని ఏంటి? అనే విషయాలు క్షణ్ణంగా పరిశీలిద్దాం.
గంగూలీ కెప్టెన్సీలో 2005 వరకు భారత్ అద్బుతమైన విజయాలు సాధిస్తూ.. ముందుకెళ్తోంది. అప్పటి కోచ్ జాన్ రైట్ తన పదవికి వీడ్కోలు పలకడంతో.. మరో సారి కూడా రైట్ నే టీమిండియా కోచ్ పదవీ బాధ్యతలు చేపట్టాలని అందరూ సూచించారు. కానీ దానికి రైట్ ఒప్పుకోలేదు. దాంతో టీమిండియాకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. దాంతో BCCI కొత్త కోచ్ కోసం వేటసాగించింది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో జిమ్మి అమర్నాథ్, టామ్ మోడి పేర్లు బలంగా వినిపించాయి. కానీ గంగూలీ మాత్రం వీరిని కోచ్ గా స్వీకరించడానికి సిద్ధంగాలేడు. దానికి బలమైన కారణం బీజం 2003లోనే పడింది. 2003లో టీమిండియాపై నార్త్ వెస్ట్ సిరీస్ ను గెలిచి ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్ లో గంగూలీకి గ్రేగ్ చాపెల్ కు పరిచయం ఏర్పడింది. ఇక ఆ సిరీస్ లో చాపెల్ కొన్ని సూచనలు గంగూలీకి చేశాడు. ఆ సూచనలు అద్బుతంగా పనిచేయడంతో.. చాపెల్ పై దాదాకి మంచి అభిప్రాయం ఏర్పడింది. దాంతోనే సౌరవ్ చాపెల్ ను టీమిండియా నూతన కోచ్ గా నియమించాలని డిసైడ్ అయ్యాడు.
నూతన కోచ్ గా గ్రేగ్ చాపెల్ ను తీసుకోవాలనే నిర్ణయాన్ని BCCIతో పాటు పలువురు ఆటగాళ్లు కూడా వ్యతిరేకించారు. చాపెల్ ను వ్యతిరేకించిన వారిలో దాదాకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి జగన్ మోహన్ దాల్మియా కూడా ఉండటం గమనార్హం. దాల్మియాతో పాటు సునీల్ గవాస్కర్ సైతం చాపెల్ ను కోచ్ గా అంగీకరించలేదు. అదీ కాక స్వయానా చాపెల్ తమ్ముడైన ఇయాన్ చాపెల్ కూడా గంగూలీ నిర్ణయాన్ని తప్పు పట్టాడు. కానీ తన నిర్ణయాన్ని మాత్రం దాదా మార్చుకోలేదు. బీసీసీఐ కూడా దాదా నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు. దానికి బలమైన కారణం ఏంటంటే? అప్పటికి టీమిండియాను దాదా ఓ రేంజ్ కు తీసుకెళ్లడమే.
అనుకున్న కోచ్ వచ్చాడు.. ఇక అంతా బాగానే ఉంటుంది అనుకున్న సమయంలోనే అసలు ఆట మెుదలైంది. ప్రశాంతగా సముద్రంలో సునామీ వచ్చినట్లు టీమిండియా జట్టులో చాపెల్ అనే సునామీ వచ్చింది. చాపెల్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న కొన్నిరోజులకే గంగూలీకి తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. చాపెల్ జట్టులోని ఆటగాళ్లను విభజించి చూడటం స్టార్ట్ చేశాడు. జూనియర్లకు,
సీనియర్లకు తగాదాలు పెట్టేవాడు. ఈ క్రమంలోనే మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. శ్రీలంక తో జరిగిన సిరీస్ లో స్లో ఓవరేట్ కారణంగా గంగూలీపై 6 మ్యాచ్ ల నిషేధం విధించింది ICC. దాంతో క్రమంగా దాదా ఫామ్ కోల్పొయాడు. ఇదే అదునుగా భావించిన చాపెల్ కెప్టెన్ గా ద్రవిడ్ ను నియమించాడు. జింబాబ్వే సిరీస్ లో దాదాని పక్కన పెట్టడంతో.. సిరీస్ జరుగుతుండగానే మధ్యలోనే సౌరవ్ ఇండియా వచ్చాడు. ద్రవిడ్ సారథ్యంలో 2007 వన్డే ప్రపంచ కప్ లో బరిలోకి దిగిన టీమిండియా.. శ్రీలంక, బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా ఓడి, ఇంటిదారి పట్టింది.
గంగూలీని పక్కన పెట్టిన చాపెల్.. పెద్ద వివాదానికి తెర లేపాడు. అప్పట్లో ఈ వివాదం క్రీడాలోకాన్నే సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. ఆ వివాదం ఏంటంటే? BCCI కి గంగూలీని శాశ్వతంగా కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఓ ఈ – మెయిల్ ని పంపాడు. ఆ ఈ – మెయిల్ కాస్తా లీక్ కావడంతో.. టీమిండియాలో పెద్ద దూమారమే చెలరేగింది. దాదాపై జరుగుతున్న కట్రలను దాదా అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. కోల్ కత్తాలో మ్యాచ్ జరిగినప్పుడు.. టీమిండియా ఆటగాళ్లు వెళ్లే బస్సును సైతం అడ్డుకున్నారు. గ్రేగ్ చాపెల్ దిష్టి బొమ్మలను కాల్చారు. పార్లమెంట్ లో సైతం దాదా వివాదం గురించి మాట్లాడారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు చాపెల్ ఎంత పెద్ద వివాదానికి తెరలేపాడో.
గంగూలీ-చాపెల్ వివాదంలో కీలక మారిన వ్యక్తి సచిన్ టెండుల్కరనే చెప్పాలి. ఎందుకంటే సచిన్ తన ఆత్మకథ అయిన “ప్లేయింగ్ ఇట్ మై వే” పుస్తకంలో ఈ వివాదం గురించి వెల్లడించాడు. ఈ పుస్తకంలో సచిన్..”చాపెల్ మా ఇంటికి వచ్చి కెప్టెన్ పగ్గాలు నవ్వు తీసుకో.. గంగూలీ కెప్టెన్ గా పనికి రాడు. టీమిండియాను మనిద్దరం చేతుల్లోకి తీసుకుందాం” అని చెప్పినట్లుగా రాసుకొచ్చాడు. అయితే ఇదే విషయాన్ని సచిన్.. తనకి చెప్పకుండా మోసం చేశాడని దాదా పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. క్రికెట్ లో ప్రాణ స్నేహితులుగా ఉన్న సచిన్-గంగూలీ లు ఇంత చిన్న విషయాన్ని చెప్పకుండా ఎలా మోసం చేశాడా? అని క్రీడావర్గాల్లో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. అదే సచిన్ ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే గంగూలీ జాగ్రత్త పడేవాడుగా.. అని అభిమానులు అంటున్నారు. దీన్ని సచిన్ తన జీవితంలో చేసిన ఒకే ఒక తప్పుగా అభిమానులు పేర్కొంటున్నారు.
Birth anniversary of a wonderful person who loved the game immensely… pic.twitter.com/5pH53Po5QW
— Sourav Ganguly (@SGanguly99) May 30, 2021