టీమ్ ఇండియా క్రికెటర్ మొహమ్మద్ షమి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యానించిన షమి..కాస్త గట్టిగానే విరుచుకుపడ్డాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గత కొద్దికాలంగా ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా టాప్ పేసర్ మొహమ్మద్ షమి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడకపోవడం వల్ల కొందరి జీవితాలు బాగుపడతాయనుకుంటే అదే పనిచేస్తానని స్పష్టం చేశాడు. తాను క్రికెట్ ఆడటం ఎవరికైనా సమస్యగా ఉందా అని ప్రశ్నించారు. అసలు తాను రిటైర్మెంట్ తీసుకునేంత తప్పేం చేశానని నిలదీశాడు. క్రికెట్ ఆటపై ఎప్పుడు విసుగొస్తుందో అప్పుడు వైదొలగుతానన్నాడు. ఓ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో షమి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తన జీవితంలో వన్డే ప్రపంచకప్ గెలవాలనే ఒకే ఒక కల ఉందని చెప్పాడు. 2023 ప్రపంచకప్ టైటిల్ కొద్గిలో మిస్ అయ్యామన్నాడు. అన్ని మ్యాచ్‌లు గెలిచి పైనల్ చేరాక కాస్త ఆందోళన చెందిన మాట వాస్తవమేనని కానీ గట్టి పట్టుదలతో బరిలో దిగామని తెలిపాడు. దురదృష్ఠవశాత్తూ కప్‌కు దూరమయ్యామన్నాడు. బాగా రాణించి టీమ్ ఇండియాకు వన్డే ప్రపంచకప్ తీసుకురావాలనుకుంటున్నామన్నారు.
ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మొహమ్మద్ షమి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తరువాత టీమ్ ఇండియాకు ఆడలేదు. ఐపీఎల్ 2025లో ఎస్ఆర్‌హెచ్ తరపున ఆడినా సరిగ్గా రాణించలేకపోయాడు. ఇంగ్లండ్ టూర్‌తో పాటు ఆసియా కప్ 2025 కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు వస్తున్న వార్తలపై ఈ వ్యాఖ్యలు చేశాడు