ధోనీ గ్యారేజ్‌లోకి మరో కాస్ట్‌లీ బైక్ వచ్చి చేరింది. ఇప్పటివరకు అత్యాధునిక, ఐకానిక్ బైకులు, కార్లపై మనసుపడ్డ ధోనీ, తాజాగా మరో సాధారణ బైక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ బైక్ ధర రూ. 2లక్షల లోపే ఉండటం, అందులోనూ ఫీచర్స్ పరంగా పెద్దగా లేనప్పటికీ.. ధోనీకి ఎందుకు నచ్చిందన్నది అంతుపట్టడం లేదు.
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది.. అతడు సాధించిన విజయాలే. కెప్టెన్‌గా భారత జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఘనత, మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు(టీ20, వన్డే ప్రపంచ కప్ లు, ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించిపెట్టిన ఘనత ఒక్క ధోనీకే సాధ్యం. ఇదిలావుంటే ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. వింటేజ్ కార్లు, బైకులన్నా అంతే ఇష్టం. వాటి కోసం ప్రత్యేకంగా ఓ గ్యారేజ్‌ను నిర్వహిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు.. అవంటే అతడికి ఎంత ఇష్టమో చెప్పడానికి. ఇప్పుడు అతడి గ్యారేజ్‌లోకి మరో బైక్ వచ్చి చేరింది.
ధోనీ మనస్సుకు ఏదైనా బైక్ నచ్చిందా..! అది తన గ్యారేజ్‌లో ఉండి తీరాల్సిందే. ఈ క్రమంలో గతేడాది దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన టీవీఎస్ కంపెనీ రోనిన్ బైక్ పై అతడి కళ్లు పడ్డాయి. దీంతో ఆ బైక్ తనకు కావాలంటూ ఆర్డర్ ఇవ్వగా, టీవీఎస్ సంస్థ బైక్ ను ధోనీ డెలివరీ చేసింది. ఈ బైక్ యొక్క బేస్ మోడల్ ధర రూ. 1,49,000 కాగా, టాప్ వేరియంట్ రూ. 1,68,750 వద్ద అందుబాటులో ఉంది. కంపెనీ అన్ని వేరియంట్స్‌ని డ్యూయెల్ టోన్ కలర్స్‌లో అందిస్తోంది. ఇందులో ధోని రోనిన్ టాప్ వేరియంట్ కొనుగోలు చేశారు.
Over the years MS DHONI has carved a niche for himself as a cricketing legend. TVS Ronin is now part of Dhoni’s garage. @imDhoni_fc @tvsmotorcompany pic.twitter.com/8spWkNQsPh
— Thrust Zone (@thrust_zone) February 18, 2023
టీవీఎస్ రోనిన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇది 225.9సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్- ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో వచ్చింది. గరిష్టంగా గంటకు 120 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు. అలాగే, ఇందులో 5- స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్ అసిస్ట్ ఫంక్షన్ కూడా ఉంది. ఇక ఇతర ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో SmartXonnect టెక్నాలజీ ఉండటం వల్ల టర్న్-బై-టర్న్ నావిగేషన్, రేస్ టెలిమెట్రీ, లో ఫ్యూయెల్ వార్ణింగ్, క్రాష్ అలర్ట్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి ఫీచర్స్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.
కాగా, ధోని గ్యారేజ్‌లో ఇప్పటికే కవాసకి నింజా హెచ్2, ఎక్స్132 హెల్‌క్యాట్, యమహా RD350, రాజ్‌దూత్, సుజుకి షోగన్, యమహా RX100, టీవీఎస్ అపాచీ 310, హార్లే డేవిడ్‌సన్, డుకాటీ వంటి 100 కంటే ఎక్కువ బైకులు ఉన్నాయి. అరుదైన కాన్ఫెడరేట్ ఎక్స్ 132 హెల్కాట్ కూడా ఉంది. ఇక కార్ల విషయానికొస్తే.. ఐకానిక్ కార్లైన మహీంద్రా స్కార్పియో, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, హమ్మర్ హెచ్ 2, నిస్సాన్ జొంగా వంటివి ఉన్నాయి. వీటిలో నిస్సాన్ జొంగా 1950 నాటి డాడ్జ్ ఎం 37 ట్రక్. ఇవి చాలా అరుదు. ఎక్కువుగా భారత సైన్యం కోసమే వీటిని తీసుకొచ్చారు.