టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదనలో తన సత్తా చూపిస్తున్నాడు. తాజాగా ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ఎంత ఆర్జిస్తున్నాడో తెలిసిపోయింది.
టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆటలోనే కాదు సంపాదనలోనూ కోహ్లీ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. క్రికెట్ ద్వారానే కాకుండా యాడ్స్, ఇతర బిజినెస్‌ల ద్వారా కోహ్లీ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో అయితే కింగ్ హవా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో కోహ్లీకి ఏకంగా 256 మంది మిలియన్ల ఫాలోవర్లుతో దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఇన్‌స్టా ద్వారా కోహ్లీకి భారీ మొత్తం లభించనుంది. ప్రతి స్పాన్సర్డ్ పోస్ట్‌కి కోహ్లీ రూ.కోట్లల్లో ఛార్జ్ చేస్తున్నాడు. కోహ్లీ ఒక్క పోస్ట్ కి ఏకంగా1.38 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లు తేలింది. అంటే ఒక్కో పోస్ట్‌కు కోహ్లీ సంపాదన రూ.11.45 కోట్లన్న మాట.
2023లో ప్రముఖ ఫొటో, వీడియో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 20 స్టార్స్ జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో కోహ్లీకి 5 వ స్థానం లభించింది. ప్రథమస్థానంలో పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో(26.75 కోట్లు) నిలవగా.. లియోనల్ మెస్సి(21.49కోట్లు) రెండో స్థానాన్ని దక్కించున్నాడు. ప్రస్తుతం కోహ్లీ క్రికెట్ లో సంపాదించేది భారీగానే ఉంటుంది. ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్ లో ఉన్న కింగ్.. ఏడాదికి తీసుకునే సాలరీ 7 కోట్లు. ఇక మూడు ఫార్మాట్ లో ఆడినందుకు గాను కోహ్లీకి భారీగానే మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఒక టెస్టు మ్యాచ్ కి 15 లక్షలు, వన్డే కి 6 లక్షలు, టీ 20ల్లో 3 లక్షల చొప్పున కోహ్లీకి బీసీసీఐ చెల్లిస్తుంది. ఇక ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో ఏడాదికి 15 కోట్లు అందుకుంటున్నాడు . ఇక బాగా ఆడినప్పుడు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ ల రూపంలో కూడా కోహ్లీకి డబ్బు వస్తుంది. ఇక ఇవి అన్ని ఒక్క ఎత్తయితే, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు.
ఇవన్నీ కలుపుకుంటే ఇప్పటివరకు కోహ్లీ ఆస్తి అక్షరాలా 1000 కోట్లు పై మాటే. ఇటీవలే స్టాక్ గ్రో నివేదిక ప్రకారం.. కోహ్లీ ఆస్తి విలువ అక్షరాలా 1,050 కోట్లు. వినడానికి షాకింగ్ గా ఉన్నా.. కోహ్లీ అంటే ఆ మాత్రం ఉంటుంది. అంతర్జాతీయ మ్యాచుల్లో ఎంత సంపాదించినా.. 1000 కోట్లకు పైగా ఆస్తి అంటే అది కేవలం కోహ్లీ క్రేజ్ ని ఇతర సంస్థలు వాడుకోవడమే. ప్రస్తుతం దేశంలో కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. చాలా మల్టీ నేషనల్ బ్రాండ్స్ అతడితో ఎండార్స్ చేసుకున్నాయి. వివిధ వ్యాపార ప్రకటనల ద్వారా కోహ్లీ రోజుకు రూ. 7.5 కోట్లు – రూ. 10 కోట్ల వరకూ సంపాదిస్తున్నదంటే విరాట్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. విరాట్ సుమారు 18 బ్రాండ్స్ కు ప్రచారకర్తగా ఉన్నాడు. మరి కోహ్లీ ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ఇంత భారీ మొత్తం ఆర్జించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.