టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో, 31న న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా సాయంత్రం 7.30 నిమిషాలకు మొదలయ్యాయి. మిగిలిన 3 మ్యాచ్‌లను కూడా టీమిండియా అదే సమయానికి ఆడనుంది. వరల్డ్ కప్‌లో రోజుకు రెండు మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటలకు ఒక మ్యాచ్, సాయంత్రం 7.30 నిమిషాలకు ఒక మ్యాచ్. సాయంత్రం జరుగుతున్న మ్యాచ్‌లలో టాస్ కీలకం అవుతోంది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే అనే భావన వచ్చేసింది.
అంతలా టాస్ కీలకం కావడానికి కారణం.. మొదటి బౌలింగ్ చేసే జట్టుకు పిచ్ అనుకూలంగా ఉండడం, ఛేజింగ్ సమయంలో మాత్రం మంచు వల్ల బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంటుంది. టీమిండియా కూడా రెండు మ్యాచ్‌లలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రెండు మ్యాచ్‌లలో ఓటమికి ఇదే ప్రధాన కారణం అయిందని పలువురు క్రికెట్ నిపుణుల అభిప్రాయం. ఇంతలా సాయంత్రం మ్యాచ్‌లపై ఆట కాకుండా ప్రకృతి ప్రభావం చూపిస్తుంటే టీమిండియా మ్యాచ్‌లన్నీ సాయంత్రమే ఉండడంపై నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
ఆదాయం కోసం టీమిండియా బలి..
వాస్తవానికి ఇలాంటి మెగా టోర్నీలకు ముందు డ్రా తీస్తారు. కానీ ప్రతిసారి ఇండియా, పాకిస్తాన్ మాత్రం ఒకే గ్రూప్‌లో ఉంటాయి. అందుకు కారణం ఉంది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే అంశాన్ని ఐసీసీ క్యాష్ చేసుకుంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు వీక్షకుల సంఖ్య చాలా ఎక్కువ. టెలివిజన్ రైట్స్, స్టేడియం టిక్కెట్ల అమ్మకంతో ఐసీసీకి భారీగా ఆదాయం వస్తుంది. అందుకే ప్రతిసారి ఈ రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఉండేలా ఐసీసీ ప్లాన్ చేస్తుంది. సెమీస్, ఫైనల్స్ వరకు రెండు జట్లు రాకున్నా కూడా ఒక మ్యాచ్ జరగడం ఖాయం. అలాగే సెమీస్ లోనో, ఫైనల్లోనో రెండు జట్లు తలపడితే రెండు మ్యాచ్‌లు జరిగి ఆదాయం మరింత వస్తుందని ఐసీసీ ఉద్దేశం. కానీ ఇదే టీమిండియాకు శాపంగా మారింది.
ఇదీ చదవండి: పొట్టి క్రికెట్ ప్రపంచకప్ వచ్చేస్తోంది… మన మ్యాచ్ లు ఎప్పుడంటే?
నిజానికి ఇండియా-పాక్ మ్యాచ్ అంటే రెండు జట్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. పైగా క్రికెట్‌ను ఒక మతంలా భావించే ఇండియాలో పాక్‌పై గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌తోనే తీవ్ర ఒత్తిడికి గురైన టీమిండియా ఆటగాళ్లు తమ స్థాయిలో ప్రదర్శన కనబర్చలేకపోయారు. అనంతరం న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఒత్తిడికి చిత్తు అయింది. అలాగే సాయంత్రం మ్యాచ్‌లను వీక్షించే వారి సంఖ్య ఎక్కువ. మన కాలమానం ప్రకారం 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతోంది. ఇండియాలో 7.30 అంటే దుబాయ్‌లో సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ మొదలవుతోంది.
ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టీమిండియా మ్యాచ్‌ను చూసే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. అందుకే టీమిండియా మ్యాచ్‌లన్నీ సాయంత్రమే జరుగుతున్నాయి. ఇలా ఆదాయం కోసం ఐసీసీ టీమిండియా మ్యాచ్‌లన్నీ సాయంత్రమే పెట్టడంతో టాస్ కీలకంగా మారి ఆటపై కాకుండా అదృష్టంపై ఆధారపడాల్సి వస్తుంది. రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం టాస్ ఓడిపోవడం, ఒత్తిడి. ఈ రెండు అంశాలు ఇంతలా ప్రభావం చూపడానికి కారణం ఐసీసీ టీమిండియాను ఆదాయ వనరుగా చూడ్డమే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి టీమిండియా మ్యాచ్‌లన్నీ సాయంత్రమే జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అత్యాచారం తప్పదు.. విరాట్ కోహ్లీ కూతురుకు హెచ్చరిక