ఐసీసీ 2027 వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 1వ తేదీ గురువారం కేప్‌టౌన్‌లో ఐసీసీ, క్రికెట్ దక్షిణాఫ్రికా సంయుక్తంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను లాంఛనంగా ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రారంభమై నవంబర్ 21న ముగియనున్న ఈ టోర్నమెంట్, సరిగ్గా ఏడాది సమయం ముందుగానే షెడ్యూల్ వెల్లడిస్తుండటంతో క్రీడా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈసారి టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకటనతో పాటు మ్యాచ్ టికెట్ల బ్యాలెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా అక్టోబర్ 1 నుంచే ఐసీసీ ప్రారంభించనుంది. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశాల హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధించగా, మిగిలిన ప్రధాన జట్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా క్వాలిఫై అవుతాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ రేసులో ముందంజలో ఉండగా, వెస్టిండీస్, నమీబియా సహా ఇతర జట్లు క్వాలిఫైయర్ టోర్నీ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
ఈసారి వరల్డ్ కప్‌ను ఐసీసీ సరికొత్త ఫార్మాట్‌లో నిర్వహించబోతోంది. 14 జట్లను రెండు గ్రూప్‌లుగా (గ్రూప్-ఎ, గ్రూప్-బి) విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి టాప్-3 స్థానాల్లో నిలిచిన ఆరు జట్లు ‘సూపర్-6’ దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. 2003 ప్రపంచకప్ తరహాలోనే సాగే ఈ వినూత్న ఫార్మాట్ టోర్నీలో ప్రతి మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చనుంది
