ఆసియా కప్ నిర్వహణ కోసం గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే వస్తుంది. పాక్ లో జరుగుతుందని భావించినా భారత్ నిరాకరించింది. ఇక ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్ ని తీసుకొచ్చినా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకి పెద్ద షాకే ఇవ్వనున్నట్లు సమాచారం.
ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది? గత కొన్ని నెలలుగా ఆసియా కప్ నిర్వహణ కోసం చర్చ జరుగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ ఆతిధ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ లో ఈ టోర్నీ నిర్వహిస్తే తాము ఆ దేశానికి రాబోమని టీమిండియా ఇదివరకే తన నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ మోడల్ అంటూ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. భారత్ తో సహా అన్ని దేశాలు ఈ విధానాన్ని తిరస్కరించాయి. దీని ప్రకారం భారత్ తమ మ్యాచ్ లను తటస్థ వేదికపై ఆడాల్సి ఉందిగా.. ఇతర మ్యాచ్ లు పాకిస్తాన్ లోజరుగుతాయి. అయితే ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒక సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం భారత్ డబ్ల్యూటీసి ఫైనల్స్ కోసం సన్నద్ధమవుతుంది. ఇక ఈ మెగా ఫైనల్ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ భారత్ ముందున్న పెద్ద టోర్నమెంట్. ఇదిలా ఉండగా ఆసియా కప్ ఎక్కడ జరుగుతుందో.. త్వరలోనే ఒక అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ టోర్నీని అసలు పాక్ లో కాకుండా శ్రీలంకలో జరిపేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. బీసీసీఐ, ఏసీసీ పాక్ చెప్పిన హైబ్రిడ్ మోడల్ కి అనుకూలంగా లేనట్టు తెలుస్తుంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల మేరకు.. ఈ ఏడాది ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆడాలనుకుంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు శ్రీలంకకు రావాల్సిందేనని అలా కాని పక్షంలో ఈ టోర్నీ నుంచి తప్పుకునే స్థితికి వచ్చినట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. “ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించే అవకాశాలు వన్ పర్సెంట్ కూడా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా తరలించాలని మేం ఐసీసీని కోరనున్నాం. ప్రస్తుతానికి ఆసియా కప్ మాత్రం శ్రీలంకలో జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఏసీసీ సభ్య దేశాలు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నాయి. త్వరలో జరుగబోయే ఏసీసీ మీటింగ్ లో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.’ అని తెలిపాడు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ పాక్ క్రికెట్ బోర్డు కి గట్టిగానే షాకిచ్చేలా కనబడుతుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.