ఉత్తరాదిలో బీజేపీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండటమో.. విపక్షంగానో బలంగానే ఉంది. ఇక ప్రస్తుతం బీజేపీ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలు. సౌత్‌లో కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీకి పట్టు ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో.. తన పట్టు పెంచుకునేందుకుగాను బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో.. అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది బీజేపీ. దుబ్బాక, మునుగోడు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో.. బీజేపీ.. టీఆర్‌కి గట్టి పోటీ ఇచ్చింది.
మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా పోరాటం చేస్తున్న బీజేపీ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. దాని కోసం పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తూ.. నిరంతరం ఏదోక సమస్య మీద కొట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో ఉంటుంది. అలానే కేసీఆర్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రజా పోరాటాలకు అండగా నిలుస్తోంది బీజేపీ.
అయితే రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం బీజేపీకి ఉన్న బలం సరిపోదు… దాన్ని పెంచుకోవాలి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. అది ఏంటంటే.. తెలంగాణలో పార్టీని బలపరిచేందుకు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు గాను.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మోదీ తెలంగాణలో పోటీ చేయడం ద్వారా రాష్ట్రంలోనే కాక.. దక్షిణాదిలో కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కాషాయ వర్గాలు భావిస్తోన్నాయి.
రానున్న ఎన్నికల్లో మోదీ.. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఈవిషమై.. ఒకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీక్రెట్ సర్వే చేయించినట్లు వార్తలు వినిపిస్తన్నాయి. ఇక ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా.. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తన అధికారిక యూబ్యూబ్ ఛానెల్‌లో ఓ పోస్ట్ పెట్టారు. రఘునందన్ రావు.. తన యూట్యూబ్ చానెల్‌లో చేసిన ఓ పోస్ట్.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పోస్ట్‌లో.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో.. మోదీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ ప్రచురితమైన ఓ న్యూస్ పేపర్ క్లిప్‌ను షేర్ చేశాడు రఘునందన్ రావు. ఆయన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది. ఇక మహబూబ్ నగర్‌లో బీజేపీకి బలం బాగానే ఉంది. గతంలో 1999 ఎన్నికల్లో వాజ్‌పేయి హయాంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున జితేందర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2012లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ తరపున ఎన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మోదీ నిజంగానే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే.. అది భారత రాజకీయాల్లో సంచలనమే అవుతుంది. మరి నిజంగానే మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.