BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై TRS చీఫ్ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వైఫల్యాలను, చేతగానితనాన్ని కేసీఆర్‌పై నెట్టడం ఏంటని ప్రశ్నించారు. గుంటనక్క మైండ్‌గేమ్‌లో పడి పార్టీ అధినేతనే తప్పుబడుతున్నారని మండిపడ్డారు. తనతో పెట్టుకోవద్దని, నిర్దిష్టమైన ఆధారాలతో అన్ని విషయాలు బయటపెడతానని హెచ్చరించారు.
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే.. సమస్యలు తమ వరకు రాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు పార్టీ వైఫల్యాలను కేసీఆర్‌పై మోపుతున్నారని విమర్శించారు. ఇలా చేస్తూ బీఆర్ఎస్‌కు గోతులు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను BRSలో ఉన్నప్పుడు ఓ అవినీతి వ్యక్తిని విమర్శిస్తే కొన్ని గంటల్లోనే సస్పెండ్ చేశారని కవిత తెలిపారు. అలాంటిది ఇప్పుడు అదే వ్యక్తితో కలిసి ఉంటూ, కేసీఆర్ తీరుతోనే పార్టీకి నష్టం జరిగిందని బహిరంగంగా వ్యాఖ్యానించడం పార్టీ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు. పార్టీ అధినేతను, ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను బహిరంగంగా తప్పుబట్టడం ఏంటని నిలదీశారు.ఫామ్‌హౌస్‌లు, అక్రమంగా ఇచ్చిన అనుమతులు, ఆంధ్రా స్నేహితులకు ఇచ్చిన ప్రయోజనాలు, క్విడ్ ప్రో కో వ్యవహారాలతో బీఆర్ఎస్‌ను పాతాళంలోకి నెట్టింది మీరే అంటూ కేటీఆర్‌పై కవిత ఆరోపణలు చేశారు.
ఇటీవల బీఆర్ఎస్ సమావేశంలో ఓ రైతు ఫోన్‌లో మాట్లాడుతుంటే ఆయన భార్యను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సాయం కోరుతూ వచ్చిన మహిళతోనూ అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. గణేశ్ నిమజ్జనోత్సవంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంతమందిని బతిమాలుకున్నారో గణేశుడికి, వారి అంతరాత్మకు తెలుసని కవిత వ్యాఖ్యానించారు. తాను విషనాగుల మాటలు విని మాట్లాడనని, నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడతానని స్పష్టం చేశారు. తనతో పెట్టుకోవద్దని హెచ్చరించారు కవిత.
