అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తెచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు, అభివృధి వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైంది. అంబేద్కర్ వర్సిటీ మాజీ ఉప కులపతి హనుమంతు లజపతిరాయ్ కన్వీనర్‌గా జేఏసీని ఏర్పాటు చేశారు. అందులో ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు సహా ఎన్జీవోల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. మేధావులు, ప్రముఖులతో ఏర్పడిన ఈ జేఏసీ సైతం అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్విహించాలని తీర్మానించారు. శనివారం విశాఖలో ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ అధ్యక్షతన ప్రత్యేకంగా జేఏసీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసీ వెల్లడించింది. త్వరలోనే మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖకు రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జేఏసీ అవతరించిందని తెలిపారు. విశాఖ రాజధానిపై రెఫరెండానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఎందుకు అనువైందో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత విశాఖే రెండో అతిపెద్ద నగరమని అన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములను మాత్రమే ఉపయోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో రాజధానిని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పోటీపడే సామర్థ్యం విశాఖకు ఉందని తెలిపారు.
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సైతం సిద్ధమని ప్రకటించారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ సమావేశంలో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడికి దమ్ముంటే అమరావతికి మాత్రమే మద్దతు తెలుపుతూ రాజీనామా చేయాలంటూ సవాల్ చేశారు. అమరావతికి మద్దతు తెలుపుతూ అచ్చెన్న టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సూచించారు. ఏపీ అభివృద్ధికి విశాఖ ఒక ఆధునిక చిహ్నంలా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పాటైన జేఏసీ నిర్ణయాన్ని బహిరంగంగా ఆహ్వానిస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు.