2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. అధికారం కోసం కాకపోయినా.. పార్టీ ప్రతిష్ట కోసమైనా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఐతే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏ దారిని వదిలిపెట్టడం లేదు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిస్తే గెలుపు తప్పదు అన్న ఆశాభావం ఇరు పార్టీల అధ్యక్షులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు నాయుడు.. ఆయా నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలను జనసేన కోసం కేటాయించేందుకు సిద్ధమయ్యారు. పొత్తుల వల్ల వైసీపీ పార్టీకి ఎంత నష్టమో అన్నది పక్కన పెడితే.. తెలుగుదేశం పార్టీకి మాత్రం పెద్దగా కలిసొచ్చే అంశం ఐతే కాదన్న వాదన టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎందుకంటే ఉన్న స్థానాల్లో అయినా టీడీపీ నాయకులు గెలిచేంతగా ప్రభావితం చేసే జోరు పార్టీలో ఎవరికుందన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో లేవనెత్తుతున్నాయి. జనసేన పార్టీ పవన్ దే కాబట్టి.. ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టి జనాన్ని ప్రభావితం చేసి ఓట్లు తెగ్గొట్టుకునే అవకాశం ఉందనేది ఒక వాదన. అయితే తెలుగుదేశం పార్టీకి కూడా జనాకర్షణ, జనాల్ని ప్రభావితం చేసే వ్యక్తి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరి అంతటి క్రేజ్, జనాలను ప్రభావితం చేసే వ్యక్తి ఎవరు అంటే పార్టీ వాళ్ళు చెప్పే మొదటి మాట ఎన్టీఆర్. 2009లో తారక్ టీడీపీ తరపున ప్రచారం చేశారు. అప్పట్లోనే తారక్ తన స్పీచ్ తో చాలా ఆకట్టుకున్నారు.
తారక్ క్రేజ్ కి టీడీపీ గెలుస్తుందని అనుకున్నారు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల టీడీపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో తారక్, టీడీపీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పట్లో రాజకీయాల గురించి ఆలోచించనని, పూర్తిగా సినిమాల మీదనే దృష్టి పెడతానని గతంలో చెప్పుకొచ్చారు. అయితే ఒకప్పుడు తారక్ కి ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు తారక్ కి ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు తారక్ అంటే దేశమే కాకుండా ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి, మెచ్చిన వ్యక్తి. కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా తారక్ ని కలిసి అభినందించారంటే తారక్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్థాయి ఉన్న తారక్.. టీడీపీ తరపున ప్రచారం చేస్తే బాగుంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే తారక్ రత్న కూడా.. 2024 ఎన్నికల ప్రచారం కోసం తారక్ పని చేస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ క్రేజ్ ని వాడుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరవ్వాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే తారక్ కి, చంద్రబాబు మధ్య సయోధ్య కుదిర్చేది ఎవరు? ఒకవేళ సయోధ్య కుదిరితే టీడీపీ తరపున ప్రచారం చేయడానికి తారక్ ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకుని ప్రచారం చేస్తే.. టీడీపీ గెలిచే అవకాశం ఉందా? 2009, 2024 ఒకటి కాదని తారక్ నిరూపిస్తారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.