సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల హఠాన్మరణాలు అభిమానులను, కార్యకర్తలను, నేతలను శోకసంద్రంలో ముంచుతున్నాయి. మొన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గుండెపోటుతో మరణించగా.. నిన్న తారకరత్న కూడా గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గుండెపోటుతో మరణించడం ఇప్పుడు పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం షుగర్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగా ఆయన మరణించారు. ఆయన మృతి పట్ల కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే సాయన్న అకాల మరణానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన లేని లోటు తీరనిదని భావోద్వేగానికి గురవుతున్నారు.