హైదరాబాద్- గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తో పరిస్థితి మరింత జటిలమయ్యింది. రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తే.. హస్తినకు చేరాల్సిన రాజకీయాలు.. ఇప్పుడు హైదరాబాద్ కు మారాయి. బండి సంజయ్ అరెస్ట్ తరువాత జరిగిన పరిణామాలు.. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా టీ ఆర్ ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందుకు కౌంటర్‌గా స్పందించిన టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జేపీ నడ్డా, బండి సంజయ్, కేంద్రంపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
అటు టీ ఆర్ ఎస్, ఇటు బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. టీ ఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీ ఆర్ ఎస్ కూడా బీజేపీనే లక్ష్యంగా చేసుకోవడంతో.. వాళ్లు అనుకున్న లక్ష్యం కూడా నెరవేరుతోంది. ఎటొచ్చి ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడిపోయింది. అయితే తెలంగాణ రాజకీయాలు ఈ రెండు పార్టీలకే పరిమితం కావడం పట్ల కాంగ్రెస్ క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చదవండి : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మూడు ప్రశ్నలు సంధించిన కేటీఆర్ఇక కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అధికార టీ ఆర్ ఎస్ పై దూకుడుగానే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలకు అటు ప్రభుత్వం నుంచి ఇబ్బందులతో పాటు.. సొంత పార్టీ నుంచి మద్దతు కరువవుతోంది. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత లోపించడం ఆ పార్టీకి ఇప్పటికే పెను శాపంగా మారినప్పటికి.. పార్టీ నేతల్లో మార్పు లేదు. అధికార పార్టీని విమర్శించాల్సింది పోయి.. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్న పార్టీ.. టీ ఆర్ ఎస్ ను ఎదుర్కొవడంలో ఏ మేరకు సఫలమవుతుందో ఆ పార్టీ కార్యకర్తలకు అర్థం కావడం లేదు. తెలంగాణలో పార్టీకి ఇంకా క్యాడర్ ఉందనేది వాస్తవం. గ్రామీణ స్థాయి నుంచి దాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తే.. రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ కు ధీటుగా నిలిచే పార్టీ కాంగ్రెస్సే. కానీ పార్టీ నాయకులు, అధిష్టానం ఈ విషయాన్ని గాలికి వదిలి.. అసంతృప్తులు, సొంత ఎజెండాలతో పార్టీని ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి : సోము వీర్రాజు మందు హామీ! సారాయి వీర్రాజు అంటూ ట్రోల్స్!ప్రస్తుత పరిస్థితుల్లో టీ ఆర్ ఎస్, బీజేపీని ఎదుర్కొవాలంటే.. కాంగ్రెస్ నేతలంతా ఒక్క మాటపై నిలబడాలి. వ్యక్తిగత ప్రాధాన్యతలను పక్కన పెట్టి.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. నేతలంతా ఒక్కతాటిపైకి వస్తేనే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు మరింత ఉత్సాహంతో పని చేస్తారు. అయితే దురదృష్టవశాత్తు అటు దేశంలోనే కాని.. ఇటు రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ నేతలు ఈ విషయం గురించి ఆలోచించడం లేదు.
పార్టీలో సీనియర్ల బాధ తట్టుకోలేక రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉన్నారు. అయినా ఆ పార్టీ నేతల్లో ఇప్పటికి మార్పు లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా మారిందో.. రాష్ట్రంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. ఈలోపు బీజేపీ బలపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చి.. పార్టీ కోసం పని చేస్తారో లేదో కాలమే తేల్చాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : బాంబ్ పేల్చిన అచ్చెన్నాయుడు