స్పోర్ట్స్ డెస్క్- భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 లో ఓ వర్గాన్ని కించపరుస్తూ యువరాజ్ వ్యాఖ్యలు చేయడంతో పోలీసు కేసు నమోదైంది. అప్పటి నుంచి విచారణ జరుపుతున్న హర్యానా పోలీసులు ఆదివారం రాత్రి యువరాజ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. 2020, జూన్‌లో టీమ్ ఇండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన యువరాజ్ సింగ్.. ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
భారత ఆటగాడు మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ టిక్ టాక్ వీడియోల గురించి ఈ సెషన్ లో ప్రస్తావనరాగా, ఈ భాంగీ వాళ్లకి ఏం పని ఉండదు.. చాహల్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోలు చూశావా.. అంటూ యువరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై అప్పట్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పిన యువరాజ్, తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చాడు. ఐతే యువరాజ్ సింగ్ పై దళిత హక్కుల కార్యకర్త, అడ్వకేట్ రజత్ కల్సన్ హర్యానాలోని హన్సి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దీంతో యువరాజ్ సింగ్‌పై గత ఏడాది ఎస్టీ ఎస్టీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి యువరాజ్ సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, మూడు గంటల విచారణ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకే యువరాజ్ సింగ్‌ని అరెస్ట్ చేశామని, విచారణ తర్వాత పూచికత్తుపై వదిలిపెట్టినట్లు ఎస్పీ నితిక గెహ్లాట్ చెప్పారు.