హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్‌ను తొలగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సమాయుత్తం అవుతోంది. ఈ నెల 20నుంచి రాష్ట్రంలో అన్ లాక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేసే అంశంపై చర్చించేందుకు శనివారం రాష్ట్ర మంత్రి మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ బేటీలో లాక్ డౌన్ తోపాటు వర్షపాతం, వానాకాలం సాగు, గోదావరి నుంచి ఎత్తిపోతలు, జల విద్యుత్తు ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం సాయంత్రం 6 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ అమలవుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కరోనా మరణాల సంఖ్య కూడా ఘననీయంగా తగ్గడంతో లాక్ డౌన్‌ను ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు, ప్రజల స్పందన, ప్రభుత్వ ఆదాయం వంటి అంశాలపై చర్చించారు. ఈ అంశాలపై శనివారం మద్యాహ్నం జరిగే కేబినేట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మేరకు తెలంగాలో లాక్ డౌన్‌ను పూర్తి స్థాయిలో సడలించి, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ములను సైతం తెరిచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక విద్యా సంస్థల పై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచి స్కూళ్లను, కళాశాలలను తెరవాలన్నదానిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో చర్చించారు. దీనిపై కూడా క్యాబినెట్ బేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.