స్పెషల్ డెస్క్- అప్పుడు సమయం రాత్రి ఏడు అవుతోంది. వర్షాకాలం కావడంతో మబ్బులు కమ్ముకున్నాయి. బాగా చీకటి పడింది. ఈ సమంలో ముగ్గురు స్నేహితులు బైక్ పై వెళ్తున్నారు. వారు గమ్యస్థానం చేరుకోవాలంటే దట్టమైన అడవిని దాటుకుని వెళ్లాలి. అలవాటు ప్రకారం అడవిలోకి ప్రవేశించారు. బైక్ లైట్ వెలుతురులో నల్లని రోడ్డు తప్ప మరేం కనిపించడం లేదు. సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా రెండు పులులు వారి బైక్ కు అడ్డంగా వచ్చాయి. ఇంకేముంది బైక్ నడుపుతున్న అతను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బ్రేకు వేశాడు.
తమవైపు ఆశగా చూస్తున్న ఆ పులులను చూసి ఆ ముగ్గురి గుండెలు జారిపొయ్యాయి. వెంటనే బైక్‌ను వెనక్కు తిప్పేందుపకు ప్రయత్నించారు. దాన్ని పసిగట్టిన ఆ పులులు వారి పైకి దూకాయి. బైక్ పై నుంచి ఆ ముగ్గురు కుర్రాళ్లు కిందకు పడిపోయారు. మొదట బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడిపై ఆ రెండు పులులు దాడి చేశాయి. మిగిలిన ఇద్దరు కుర్రాళ్లు బైక్ ను వదిలేసి ప్రాణ భయంతో పరుగులు తీశారు. పక్కనే ఉన్న చెట్టును ఎక్కేందుకు ప్రయత్నించారు. బైక్ పై చివరలో కూర్చున్న యువకుడు చెట్టు పైకి ఎక్కగా, మధ్యలో కూర్చున్న వ్యక్తి ఓ చెట్టును ఎక్కుతుండగానే ఓ పులి అతడిపై దాడి చేసింది.
తన ఇద్దరు స్నేహితులపై దాడి చేసిన పులులు వారిని చంపి పీక్క తినడం కళ్లారా చూశాడు చెట్టుపై ఉన్న యువకుడు. కాసేపటికి ఆ పులులు అతనిపైకి కూడా దాడికి యత్నించినా అవి చెట్టు ఎక్కలేకపోయాయి. సుమారు ఎనిమిది గంటల పాటు రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేకుండా ఆ యువకుడు చెట్టుపైనే ప్రణాలు అరచేతిలో పెట్టుకుని నిరీక్షించాడు. ఆ రెండు పులులు సైతం అతడి కోసం చాలా సేపు వేచి చూశాయి. ఏంటీ ఇదంతా వింటే ఏదో సినిమా కధలా ఉందా.. అస్సలు కాదండీ బాబు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిట్ ప్రాంత పరిధిలోని ఖర్నౌట్ నదీ పరివాహ ప్రాంతంలోని అటవీ పరిసరాల్లో నిజంగా ఈ ఘటన జరిగింది. చివరికి తెల్లవారు జామున 3గంటల 30 నిమిషాల సమయంలో ఆ పులులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఉదయం ఆరు గంటల సమయంలో కొందరు వ్యక్తులు వెళ్తోంటే, వాళ్లను పిలిచి, వారి సాయంతో ఆ యువకుడు అడవి బయటకు వెళ్లాడు. ఇక పోలీసుల గాలింపులో ఒక యువకుడిు మృతదేహం మాత్రమే దొరికింది. మరో యువకుడి దేహాన్ని పులులు అడవిలోకి లాక్కెళ్లాయి.