ప్రపంచ దేశాలలో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టినప్పటికీ దాని కొత్త వేరియెంట్స్ మాత్రం జనాలను భయం గుప్పిట్లో ఉంచుతున్నాయి. ఇప్పటికే కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా రోజుకో దేశానికి వ్యాపిస్తుంది. వైద్యనిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు 20కి పైగా దేశాల్లో నమోదయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఇండియాలో ఒమిక్రాన్ కేసులు బయటపడలేదు కానీ ఆల్రెడీ మనదేశంలోకి ప్రవేశించే ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందువలన ముందు జాగ్రత్తగా ఇండియా పలు చర్యలు చేపట్టింది. విమానాశ్రయాలలో కరోనా టెస్టులు వేగవంతం చేయటంతో పాటుగా సాంపిల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్స్ చేయిస్తుంది. అలాగే ఎక్కువగా ఆఫ్రికా దేశాలలో ఈ కేసులు నమోదు అవుతుండటంతో యునైటెడ్ కింగ్‌డమ్, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్సువానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా దేశాల నుండి వచ్చేవారికి ప్రొటొకాల్స్ తప్పనిసరిగా విధించింది. అది స్వదేశీయులైన, విదేశీ ప్రయాణికులైనా ఆంక్షలు తప్పవని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
విమాన ప్రయాణికులు ఖచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ ఎయిర్ పోర్టు సిబ్బందికి సమర్పించి నెగటివ్ రిపోర్టును సువిధ యాప్ లో అప్లోడ్ చేయాల్సిందిగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే విదేశీ ప్రయాణికులు కరోనా టెస్ట్ అనంతరం రిపోర్ట్ నెగటివ్ వచ్చినా 14 రోజులపాటు హోమ్ క్వారెంటైన్ లో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. అలాగే కరోనా నిర్ధారణ జరిగిన అనంతరం ప్రయాణికులు గత 14 రోజులు ఏయే దేశాల్లో పర్యటించారో పూర్తీ వివరాలు ఎయిర్ పోర్టు సిబ్బందికి తెలియజేయాలని కేంద్ర ఆదేశించింది.