కావాల్సినవి అన్ని సమకూర్చి పెట్టినా సరే.. ఎందరో విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే విద్యార్థిని మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఆమె కథ ఎందరికో ఆదర్శం. ఆ వివరాలు..
జీవితం అంటే మనం అనుకోని, ఊహించని సంఘటనల సమాహారం. వచ్చిన వాటిని స్వీకరిస్తూ.. నచ్చనివాటి గురించి వదిలేస్తూ ముందుకు సాగాలి. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి.. మరింత సంతోషంగా బతికే ప్రయత్నం చేయాలి.. మన కలల్ని, ఆశయాలను సాధించుకోవాలి. అంతే తప్ప చిన్న చిన్న విషయాలకే భయపడి పోయి.. ప్రాణాలు తీసుకునేంత పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. అయితే ఇలాంటి మాటలు చెప్పడం చాలా తేలిక అంటారా.. అయితే ఇప్పుడు ఓ అమ్మాయి గురించి తెలుసుకుందాం. సంతోషంగా సాగిన ఆ విద్యార్థిని జీవితాన్ని ఓ ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే తండ్రి కన్నుమూశాడు. మరింత దారుణం ఏంటంటే ఆ బాలిక తన గతం మర్చిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎంత దిగులుగా, డిప్రెషన్‌కు గురయి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ బాలిక ధైర్యంగా నిలబడింది. కన్నీళ్లు తుడుచుకుని.. తండ్రి చెప్పిన లక్ష్యం దిశగా అడుగులు వేసింది. ఇక తాజాగా వెల్లడించిన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల్లో సత్తా చాటి.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆ విద్యార్థిని వివరాలు..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నివేదితా చౌదరి.. విధిని ఎదిరించి నిలబడింది. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే.. ధైర్యం మాత్రం కొల్పోలేదు.. గమ్యాన్ని మర్చిపోలేదు. కష్టపడి చదివి.. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. ఆమె జీవితంలో అంతులేని విషాదం దాగుంది. నివేదితాకు 10 ఏళ్ల వయసులో అనగా 2014లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నివేదిత దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. తీవ్రంగా గాయపడింది. తలకు బలమైన గాయం కావడంతో.. నెల రోజులకు పైగా కోమాలో ఉంది. మరో విషాదం ఏంటంటే.. ఈ ప్రమాదంలో ఆమె తన గతం మర్చిపోయింది.
అంతేకాకా ఏడాదికి పైగా మంచానికే పరిమితమైంది. ఈ ఘటన జరిగి 9 ఏళ్లు పూర్తయినా.. ఇప్పటికీ మరొకరి సాయం లేకుండా నివేదిత నడవలేదు, రాయలేదంటే.. ఆ ప్రమాదం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలోనే తండ్రిని కోల్పోయింది. చదవడం, రాయడం అన్ని మర్చిపోయింది. దాంతో మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. దాంతో నివేదిత తల్లి ఆమెను స్కూల్ మార్చింది. 9వ తరగతి వరకు మీరట్‌లోని సోఫియా బాలికల పాఠశాలలో చదివిన నివేదిత తర్వాత ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చేరింది.
ఇక తాజాగా మే 12న విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 90.4 శాతం మార్కులతో ప్రతిభ చాటింది నివేదితా. తనకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదవాలని ఆసక్తి ఉందని నివేదిత చెబుతోంది. రోడ్డు ప్రమాదం తర్వాత వీల్ చైర్‌కే పరిమితమైన నివేదితాకు స్నేహితులు కూడా పెద్దగా లేరు. ఆమె తల్లి నళిని నివేదితాను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆమెకు సేవలు చేస్తూనే.. జీవితం మీద నమ్మకం, ధైర్యం కోల్పోకుండా చూసేది. అంతేకాక చదువుకోవడానికి కూడా ఎంతో సాయం చేసింది. పాఠాలను చెప్పడం, రాయడంలో సాయం చేసింది. అన్ని వేళలా బిడ్డకు తోడుగా ఉండి.. తను ముందుకు సాగేందుకు మద్దతుగా నిలిచింది.
ఇక నాడు జరిగిన ప్రమాదంలో నివేదిత తండ్రితో పాటు ఆమె తోబుట్టువు మరొకరు కూడా కన్ను మూశారు. తల్లి నళిని, నివేదిత ఇద్దరు మాత్రమే మిగిలారు. ఇక నివేదిత ప్రస్తుతం వీల్ ఛైర్‌కే అంకితం అయ్యింది. ఈ ప్రమాదం తన జీవితాలను తారుమారుచేసింది అంటుంది నివేదిత తల్లి నళిని. ప్రమాదానికి ముందు తాను ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేదాన్ని అని నళిని తెలిపారు. తన భర్త చౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసేవారని వెల్లడించింది. ప్రమాదం తర్వాత కుమార్తె బాగోగులు చూసుకునేందుకు తాను ఉద్యోగం మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
కుమార్తెను చూసుకునేందుకు అదనపు సెలవుల కోసం తక్కువ జీతం వచ్చినా సరే.. గతంలో తన భర్త చేసిన యూనివర్శిటీలోనే తాను పని చేస్తోన్నట్లు వెల్లడించింది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి భయటపడిన తర్వాత కూడా తన బిడ్డ వీల్‌ఛైర్‌లో ఉంటూనే.. సీబీఎస్‌ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందకు గర్వంగా ఉందని తెలుపుతోంది నళిని. మరి నివేదిత కృషి, పట్టుదల చూస్తే మీకేమనిపిస్తోంది.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.