నడి రోడ్లు రక్తపు టేరులై పారుతున్నాయి. రోడ్లపై జరిగే యాక్సిడెంట్ల వల్ల అనుకుంటే పొరపాటు.. హత్యలు, దాడుల వల్ల. జనాలు చూస్తున్నారన్న భయం ఏమాత్రం లేదు. నడి రోడ్డుపై హత్యలకు ఒడిగడుతున్నారు.
నడి రోడ్లు రక్తపు టేరులై పారుతున్నాయి. రోడ్లపై జరిగే యాక్సిడెంట్ల వల్ల అనుకుంటే పొరపాటు.. హత్యలు, దాడుల వల్ల. జనాలు చూస్తున్నారన్న భయం ఏమాత్రం లేదు. నడి రోడ్డుపై హత్యలకు ఒడిగడుతున్నారు. ఇటీవల కాలంలో రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ పట్టపగలు, నట్ట నడివీధిలో దారుణాలకు పాల్పడుతున్నారు దుండగులు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడి చంపడం పరిపాటిగా మారిపోతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బీజెపీ నేతను అతడి నివాసం ముందే దుండగులు తుపాకీతో కాల్చి ఆ తర్వాత పరారయ్యారు. నడి రోడ్డుపై అతడిని చంపడం ఇప్పుడు సంచలనం కలిగించింది. ఆ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ కు చెందిన బీజెపీ నాయకుడు అనూజ్ చౌదరి (34) మొరాదాబాద్ ప్రాంతంలో తన నివాసం ఎదుట దారుణంగా హత్యకు గురయ్యారు. తన అపార్ట్‌మెంట్ బయట మరొక వ్యక్తితో కలిసి వెళుతుండగా.. బైక్‌పై వెనుక నుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడిపై గన్ గురి పెట్టి కాల్చి చంపారు. పలు మార్లు కాల్పులు జరిపారు. తర్వాత అక్కడి నుండి పరారయ్యారు. అనూజ్‌ను మొరాదాబాద్‌లోని బ్రైట్‌స్టార్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రాజకీయాలలో చురుగ్గా వ్యవహరించే అనూజ్.. సంభాల్ అస్మోలీ బ్లాక్ నుండి బ్లాక్ చీఫ్ ఎన్నికలలో పోటీ చేసారు కానీ ఓడిపోయారు.
గతంలో తనకు ప్రాణ హాని ఉందని సంభాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కాస్త పెద్ద నాయకుల పరిచయం ఉండటం వల్ల.. ఆ పలుకుబడిని వినియోగించుకున్నారు. దీంతో ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు. తర్వాత ప్రత్యర్థులతో రాజీ కుదరడంతో ఆ భద్రత ఉపసంహరించుకున్నారు. కానీ ఇప్పుడు తుపాకీ తూటాలకు బలయ్యారు. రాజకీయ ప్రత్యర్థులే హత్యకు పాల్పడ్డారని అనూజ్ కుటుంబం ఆరోపించింది. అమిత్ చౌదరి, అనికేత్ ఈ హత్యకు పాల్పడ్డారని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నలుగురిపై కేసు నమోదు చేసిన నిందితులు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.