బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నై, దాని శివారు జిల్లాల్లో కొద్దిరోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వీధులు జలమయమై నదులను తలపిస్తున్నాయి. దీంతో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించింది. 2015 తర్వాత ఆ స్థాయిని గుర్తుకు తెచ్చేలా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఎడతెరపిలేకుండా వానలు కురుస్తుండంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.
తమిళనాడులో అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 43 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరద ముంపులో ఉన్న వారికి నిత్యావసర సరుకులు,ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో చెంగల్ పట్టులోని పెరుంబక్కమ్ ప్రాంతంలో వరదలో చిక్కుకున్న ఓ బాలింతను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేశారు. వానకు చంటి బిడ్డ తడవకుండా ఇలా కవర్అడ్డుపెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. తల్లీ బిడ్డలను సురక్షిత ప్రాంతానికి తరలించిన రెస్క్యూ టీమ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక చెన్నైలోని టీపీ చత్రమ్ ప్రాంతంలో స్పృహ కోల్పోయి పడిపోయిన 28 ఏళ్ల ఓ వ్యక్తిని తన భుజాలపై మోసుకెళ్లి ఆటోలో ఆసుపత్రికి తరలించి మహిళా ఎస్సై రాజేశ్వరి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్, ఐపీఎస్ అధికారులు మహిళా ఎస్సై రాజేశ్వరి అందించిన సేవలను కొనియాడారు.