పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటై సాగించే ఓ సుదీర్ఘ ప్రయాణం. ఇది ఓ జీవితం మొత్తానికి సరిపడే అనుబంధం. అలాంటి పెళ్లి గురించి అందరూ చాలానే కలలు కంటారు. ఇక వయసుకి వచ్చిన అబ్బాయి అయితే తనకి కాబోయే భార్యని ఊహించుకుంటూ కలల్లో తేలిపోతుంటాడు. తనని నమ్మి తన వెంట వచ్చేసే ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలని సకలం సిద్ధం చేసి పెట్టుకుంటాడు. కానీ.., అన్నీ ప్రయాసలకు ఓర్చి.., తాను పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదు, తాను మోసపోయానని ఆ అబ్బాయికి తెలిస్తే..! పాపం గుండె బద్దలు అయిపోతుంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇప్పుడు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది ఏప్రిల్ 28న వివాహం జరిగింది. అమ్మాయి అందంగా ఉండటం, కోరిన కట్నం ఇవ్వడంతో తనకన్నా అదృష్టవంతుడు లేడని మురిసిపోయాడు. కానీ.., పెళ్లైన నాటి నుంచి భార్య అతడికి దూరంగా ఉంటూ వచ్చింది . అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆమెకి సపోర్ట్ చేస్తూ వచ్చారు.గట్టిగా అడిగితే.. ఆరోగ్యం బాగాలేదని కార్యాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చాక కూడా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. అలా చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. దీంతో.., లాభం లేదనుకున్న ఆ భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. ఆ టెస్ట్ లలో షాకింగ్ న్యూస్ బయట పడింది. సదరు వ్యక్తి భార్య అసలు మహిళే కాదని.., ఆమె ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలిపారు వైద్యులు. తాను మోసపోయానని తెలుసుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.