తల్లిదండ్రులు నేర్పిన మంచితనం, ‘సాటివారికి సాయం చేయాలి’ అని వారు చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని.. తాను స్థిరపడిన వృత్తి ద్వారా చిన్నారుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తున్నారు డాక్టర్ సుబోధ్ సింగ్. పసిపిల్లల ముసిముసి నవ్వులనే తన ఫీజుగా భావిస్తూ.. గ్రహణ మొర్రితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా 37 వేల సర్జరీలు చేసి.. 25 వేల చిన్నారులకు కొత్త రూపాన్ని ఇచ్చి వారి చిరునవ్వును చూసి మురిసిపోయారు డాక్టర్ సుబోధ్. 2002లో మొదలైన ఈ చిరునవ్వుల సేద్యాన్ని కొనసాగిస్తున్న డాక్టర్ సుబోధ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.
సుబోధ్ సింగ్ వారణాసికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో క్లర్క్‌గా పనిచేసేవారు. 1979లో ఆయన మరణంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కారుణ్య ప్రాతిపదికన సుబోధ్ అన్నకు తండ్రి ఉద్యోగం వచ్చినా ఆర్థిక ఇబ్బందులు తగ్గలేదు. దీంతో మరో సోదరుడు సబ్బులు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. సుబోధ్ కూడా పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత సాయంకాలం సబ్బులు అమ్మి, కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇలా చిన్నతనం నుంచే బాధ్యతగా ఉంటూ పాఠశాల విద్యను పూర్తి చేసిన సింగ్, ఉన్నత చదువుల కోసం పూర్తిగా కుటుంబంపై ఆధారపడకుండా పార్ట్ టైమ్ జాబ్ చేసేవారు.
డాక్టర్ కావాలనే సుబోధ్ సింగ్ బలమైన సంకల్పానికి సోదరులు కూడా చేయూతనిచ్చారు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం వాళ్లే ఫీజు కట్టారు. అన్నలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్- పుణె, బనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ ఎంట్రాన్స్ ఎగ్జామ్, ఉత్తర్‌ప్రదేశ్ స్టేట్ కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్ వంటి మూడు ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించారు సుబోధ్. ఆయన వైద్య విద్య పూర్తి చేసి.. డాక్టర్‌గా స్థిరపడ్డ తర్వాత వారి కుటుంబం ఆర్థికంగా కాస్త బలపడింది. ఇక సుబోధ్ తదుపరి లక్ష్యం అమ్మనాన్న చెప్పిన మాటను అమలుపర్చడం. సాయం చేసే స్థాయిలో ఉన్నప్పుడు సాటివారికి కచ్చితంగా సహాయం చేయాలి అని వారు చెప్పిన విధంగా.. చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయాలని సుబోధ్ నిర్ణయించుకున్నారు.
2002లో ఆయన తండ్రి వర్ధంతి రోజు నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు 37 వేల శస్ర్తచికిత్సలు చేసి 25 వేల కుటుంబాలను ఆదుకున్నారు. గ్రహణ మొర్రితో బాధపడుతున్న పిల్లలకు ఉచిత ఆపరేషన్లు చేసి వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు. సుబోధ్ సేవలకు గాను 2009 అకాడమీ అవార్డు అందుకున్నారు. వింబుల్డన్‌లో ఆండీ ముర్రే , నోవాక్ జొకోవిచ్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టాస్ వేసే సమయంలో డాక్టర్ సుబోధ్ సింగ్ సమక్షంలో, అతని రోగి పింకీ సోంకర్‌కు నాణెం వేసే అరుదైన గౌరవం లభించింది. అలాగే శస్ర్తచికిత్స నిపుణులు, సామాజిక కార్యకర్తలు, పౌష్టికాహార నిపుణులతో కలసి ఓ బృందంగా ఏర్పడి.. దేశవ్యాప్తంగా మొర్రి సమస్యతో బాధపడుతున్న పిల్లలను గుర్తించేందుకు ‘ఔట్ రీచ్’ కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. వీటితో పాటు 6,000 బర్న్ సర్జరీలను కూడా ఈ బృందం ఉచితంగా నిర్వహించింది.
