భారత దేశం అంటే ఎన్నో మతాలు, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వం మన నినాదం. వేర్వేరు సంప్రదాయాలకు చెందిన ప్రజలంతా కలిసి మెలిసి జీవించే సమాజం మనది. హిందూ ముస్లిం భాయి భాయి అని భావిస్తాం. అయితే గత కొన్నేళ్లుగా కొన్ని దుష్ట శక్తులు.. మనలోని మత సామరస్యాన్ని దెబ్బ తీసి.. మనలో మనకే గొడవలు పెట్టి కొట్టుకు చచ్చేలా చేస్తున్నాయి. మతాల పేరిట జనాలను రెచ్చగొట్టి.. చోద్యం చూస్తున్నారు. మీడియాలో నిత్యం మత విద్వేశాలకు సంబంధించిన వార్తలు తరచుగా వస్తుంటాయి. ఈ ధోరణి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రపంచం తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి వస్తుంది. మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగవుతుంది. తోటి వారిని నిత్యం అనుమానిస్తూ బతకాల్సిన పరిస్థితి తలెత్తుంది.
అయితే ఇలాంటి విద్వేశపూరిత పరిస్థితుల్లో కూడా అక్కడక్కడా మానవత్వం పరిమళిస్తుంటుంది. కాకపోతే అలాంటి సంఘటనలు త్వరగా వెలుగులోనికి రావు. ఆ కోవకు చెందిన సంఘటనే ఇది కూడా. పాతికేళ్లుగా తన దగ్గర ఎంతో నమ్మకంగా పని చేసిన గుమస్తా మృతి చెందాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యాజమాని ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. అంతేకాక ఆ ఉద్యోగి పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించాడు. అసలు విశేషం ఇక్కడే ఉంది. మృతి చెందిన వ్యక్తి హిందువు కాగా.. అంత్యక్రియలు చేసిన వ్యక్తి ముస్లిం. దాంతో ఈ సంఘటన వైరల్‌గా మారింది.
బిహార్ రాజధాని పాట్నాలో రిజ్వాన్‌కు ఓ కుట్లు అల్లికల ఉత్పత్తుల షోరూం ఉంది. తన దగ్గర పాతికేళ్ల పాటు నమ్మకంగా పని చేసిన రామ్ దేవ్ షా అనే వ్యక్తి ఈ మధ్యే వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశాడు. విషయం తెలిసిన రిజ్వాన్.. ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. ఆ పెద్దాయన పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. రిజ్వాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అంతిమ యాత్ర సమయంలో వెంటే ఉన్నారు.
ఈ సందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘పాతికేళ్ల కిందట రామ్ దేవ్ షా దుకాణానికి వచ్చి పని ఏమైనా ఉందా? అని అడిగాడు. ఇక్కడ అన్ని మోటు పనులే.. మీరు చేయలేరు అన్నాను. కానీ ఆయన వెళ్లలేదు. లెక్కలు రాసే పని అయినా ఇమ్మని బతిమాలాడు. ఆయనెంతో సాదాసీదాగా కనిపించాడు. అందుకే పని ఇచ్చాను. ఇరవై ఏళ్లకు పైగా ఆయన నా దగ్గరే పని చేశారు. వయసు రిత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. నెల నెల కొంత డబ్బు పంపించా. షా నాకు తండ్రి లాంటి వారు. నాకు ఒక పెద్ద దిక్కు. ఆయన కుటుంబం.. మా కుటుంబంతో సమానం. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నాకు చేతనైన రీతిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను’’ అంటూ రిజ్వాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా రిజ్వాన్ మత సామరస్యం గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘కష్టకాలంలో మనిషి.. మతానికి ఓటేస్తాడా.. మానవత్వానికి ఓటేస్తాడా.. మనిషంటే ఒక నమ్మకం.. ఆత్మీయత, అంతకు మించి అభిమానం. మానవత్వం ఎంతో గొప్పది. ఎందుకనో టీవీల్లో కూడా సరైన విషయాలను చూపించరు. ఒక పిల్లవాడు గాయపడితే.. ముందు అతన్ని పైకి లేపుతాం. గాయానికి మందు వేసి అతన్ని ఓదారుస్తాం. అంతేగానీ.. నీది ఏ మతం బాబు అని అడగం. అసహ్యించుకోం. హిందువులు మా ఇంట కార్యక్రమాలకు హాజరవుతారు. అదే విధంగా మేం వాళ్ల కార్యక్రమాలకు హాజరవుతాం. ఏళ్లుగా మేం కలిసిమెలిసి బతుకుతున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. రిజ్వాన్ మాటలు విన్న ప్రతి ఒక్కరు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.