గతం లో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రేక్షకులను మెప్పించి అద్భుతమైన రేటింగ్స్ తో ఎంతో జనాదరణ పొందింది. నాగార్జున ,చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో ఆ షో స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ గేమ్ షో గా మంచి కార్యక్రమాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన విషయం ప్రేక్షకులకు విదితమే . అదే పాపులర్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గా టైటిల్ మార్పుతో మళ్ళీ మరో ఛానల్ స్మాల్ స్క్రీన్‌పై అలరించబోతోంది.
దీనికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరకి తెలుసు . ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ నిరాటంకంగా జరుగుతోంది. ఈ షో ప్రత్యేక ఆకర్షణ గా ఎందరో సెలబ్రెటీలను ఆహ్వానించటం పరిపాటి . ఈ పాపులర్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ షోలో కనువిందు చేయటానికి ఫస్ట్ గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్టు తెలుస్తోంది.
అగ్రశ్రేణి దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ – ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ మొదలయ్యాక ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే ఫస్ట్ గెస్ట్‌గా చరణ్‌ను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరిని బుల్లితెరపై చూడాలని అభిమాన ప్రేక్షకులంతా ఎంతో ఉత్సాహం తో ఎదురుచూస్తున్నారు .
వీరిద్దరి కాంబినేషన్ తో నిర్వాహకులు అద్భుతంగా త్వరలో ఓ ప్రోమోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించే విధంగా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఒక మంచి షో గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ నిలవాలని కోరుకుందాం.