ఓ ఆసుపత్రి చేసిన పొరపాటు దాదాపు 800 మందిని భయాందోళనకు గురిచేసింది. ఆ ఆసుపత్రినుంచి వచ్చిన మెసేజ్ చూసి వారంతా విషాదంలో మునిగిపోయారు. కొత్త సంవత్సరం రోజున తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటంటూ బాధపడ్డారు. చివరకు అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ ఆసుపత్రి చేసిన పొరపాటు ఏంటి? పేషంట్లను విషాదంలో ముంచేంతలా ఆ మెసేజ్‌లో ఏముంది? తెలుసుకోవాలంటే ఈ వార్త మొత్తం చదివేయండి. ఇంతకీ సంగతేంటంటే.. ఇంగ్లాండ్‌లోని సౌత్ యార్క్ షేర్‌లో ఆస్కెర్న్ మెడికల్ ప్రాక్టిస్ అనే ఆసుపత్రి ఉంది. నిత్యం వందల సంఖ్యలో పేషంట్లు అక్కడ వైద్యం చేయించుకోవటానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తమ వద్దకు వచ్చే పేషంట్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలని ఆసుపత్రి భావించింది. తమ సిస్టమ్‌లో ఉన్న ఫోన్ నెంబర్లకు కొత్త సంవత్సరం రోజున ఓ మెసేజ్ పంపింది.
మొత్తం 800 మందికి మెసేజ్ పంపింది. అయితే, మెసేజ్ చూసిన 800 మంది షాక్ అయ్యారు. కొత్త సంవత్సరం రోజున ఇదేం ఖర్మరా బాబు అనుకున్నారు. దేవుడా! మేము ఎక్కువ రోజులు బతకమా’ అనుకుని విలవిల్లాడిపోయారు. ఇలా వీళ్లు విషాదంలో ఉండగానే సదరు ఆసుపత్రినుంచి మరో మెసేజ్ వచ్చింది. ఈ సారీ ఆ మెసేజ్‌లో ‘‘ సారీ! న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పటానికి బదులు మీకు తప్పుడు మెసేజ్ వచ్చింది. మీకు భయంకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏమీ లేదు! ’ అని ఉంది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇందాక తమకు వచ్చిన ‘ డియర్ పేషంట్.. మీకు భయంకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంది’ అన్న మెసేజ్‌ను చూసుకుని కొంతమంది నవ్వుకున్నారు.
మరికొంతమంది కొత్త సంవత్సరం రోజు ఇదేం జోక్ అంటూ సీరియస్ అవుతున్నారు. కొంతమంది తమ అనుభవాల్ని ఇలా పంచుకున్నారు. ‘‘ నేను నా వెనకాల ఓ మచ్చ ఉంటే దానికి పరీక్షలు చేయించుకున్నాను. దాని రిపోర్టు కోసం వేచి ఉన్నాను. అలాంటి టైంలో నాకు ఈ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే నా గుండె పగిలింది. బాధతో ఏడుపు ఆగలేదు. తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది. అది చదివిన తర్వాత ఆసుపత్రికి కాల్ చేశా. ఎవరూ స్పందించలేదు’’ అని సారా హర్గీవ్స్ చెప్పుకొచ్చింది. మరి, ఆసుపత్రి పొరపాటు దాదాపు 800 మంది పేషంట్లను ఇబ్బంది పెట్టిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.