సైనిక పాలనలో కొనసాగుతున్న మయన్మార్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ మిలిటరీ జుంటా తీర్పు చెప్పింది. మిలటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రేరేపించినందుకు, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మయన్మార్ పౌర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు విధించింది మయన్మార్ కోర్టు. ఈ విషయాన్ని జుంటా ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.
సూకీకి ‘సెక్షన్ 505(బి) కింద రెండేళ్లు, ప్రకృతి విపత్తు చట్టం ప్రకారం మరో రెండేళ్ల జైలుశిక్ష కోర్టు విధించింది.’ అని ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు. గత ఫిబ్రవరిలో మయన్మార్ సైన్యం అక్కడి పౌర ప్రభుత్వాన్ని కూల్చివేయడం తెలిసిందే. దేశాధికారాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న సైన్యం… తనకు ఎదురులేకుండా ఉండేందుకు ఆంగ్ సాన్ సూకీ, ఇతర కీలకనేతలను నిర్బంధించింది.
మయన్మార్ సైనిక చర్యలపై అంతర్జాతీయంగా వ్యతిరేకత కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలపై దాడులను మానుకోవాలని హితవు పలికాయి. మరోవైపు దేశంలో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగానే నిరసనల్లో పాల్గొంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.