ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ మనుషుల జీవన విధానంలో వారి అవసరాలలో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. అలాగే టెక్నాలజీ అనేది ప్రస్తుత మానవ జీవనంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఎంతలా అంటే ఒక్కోసారి మన బాహ్య ప్రపంచంలోనే కాదు.. మన శరీరంలో కూడా భాగమవుతూ వస్తోంది. శరీరంలో భాగమవడం ఏంటని పెద్దగా ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి తెలిస్తే మీరే నిజమని నమ్మక మానరు. అవును లండన్ లోని హ్యాక్నీ అనే ప్రాంతానికి చెందిన 40 ఏళ్లు పైబడిన స్టీవ్ వర్జీ అనే వ్యక్తి ఇటీవలే 3డి టెక్నాలజీతో కృత్రిమ కన్నును అమర్చుకున్నాడు. అయితే ప్రపంచంలోనే 3డి కృత్రిమ కన్ను అమర్చుకున్న మొదటి వ్యక్తిగా స్టీవ్ వార్తల్లో నిలిచాడు.
మూర్ ఫీల్డ్స్ ఐ హాస్పిటల్లో నవంబర్ 25న స్టీవ్ కు శస్త్రచికిత్స చేసి కృత్రిమ కన్నును అమర్చారు వైద్యులు. అయితే ఈ త్రీడి టెక్నాలజీ ఐ గురించి మూర్ ఫీల్డ్స్ హాస్పిటల్ ఆఫ్తాల్మాలోజిస్ట్ ప్రొఫెసర్ మన్దీప్ సాగు మాట్లాడుతూ.. సాధారణంగా కృత్రిమ కన్ను గలవారు వారి కంటి సాకెట్ ని మార్చుకోవడానికి దాదాపు 2 గంటల పాటు వైద్యులకు సహకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కృత్రిమ కన్నును అమర్చి రంగు వేయాలి. అయితే ఈ 3డి కన్ను అడ్వాంటేజ్ ఏంటంటే.. దీని తయారీకి సమయం కూడా రెండు నుంచి మూడు వారాలే పడుతుంది. కానీ ఫస్ట్ టైం హాస్పిటల్ కి వెళ్తే మాత్రం అరగంట అపాయింట్మెంట్ సరిపోతుందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఈ డిజిటల్ కృత్రిమ కంటి పని తీరుపై మూర్ ఫీల్డ్స్ హాస్పిటల్ సిబ్బంది చాలా ఆసక్తిగా ఉన్నట్లు సాగు తెలిపారు. ఈ నూతన టెక్నాలజీ విధానం అనేది రాబోవు క్లినికల్ ట్రయల్స్ కు హెల్ప్ అవుతుందని.. అలాగే ఈ త్రీడి టెక్నాలజీ వల్ల రోగులకు మరింత మేలు జరిగే అవకాశం ఉందని వైద్య సిబ్బంది చెప్పుకొచ్చింది. ఇక వర్జీ మాట్లాడుతూ.. తనకు 20 ఏళ్ల వయసు నుండి కృత్రిమ కన్ను అవసరం ఉందని అదీగాక ఈ త్రీడి కన్ను చూడటానికి చాలా బాగుందంటూ హర్షం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం ఈ త్రీడి టెక్నాలజీ ఐ టాపిక్ నెట్టింట వైరల్ గా మారింది.