హైదరాబాద్- తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ. రాష్ట్ర మాజీ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. గత యేడాది రజత్ కుమార్ కూతురు వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఆయన కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా, అత్యంత ఖరీదైన ఫలక్ నుమా ప్యాలేస్ తాజ్ డెక్కన్, తాజ్ హోటల్స్‌లో విడిదితో పాటు భారీ పార్టీలతో అట్టహాసంగా జరగడం హాట్‌టాపిక్‌గా మారింది.
రజత్ కుమార్ కుమార్తె వివాహంపై ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక కథనం రాజకీయవర్గాలతో పాటు అధికారవర్గాల్లో సంచలనం రేపుతోంది. రజత్ కుమార్ కుమార్తె వివాహం గత డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన కుమార్తె పెళ్లి ఫైవ్ స్టార్ వివాహానికి ఓ అజ్ఞాత కంపెనీ డబ్బులు ఖర్చు చేసినట్లు ఆంగ్ల దిన పత్రిక కథనం తెలిపింది.
రజత్ కూతురు వివాహానికి బిగ్‌వేవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే షెల్ కంపెనీ పేరుతో హోటల్స్, పార్టీల బిల్లులు చెల్లించారని, ఓ మెగా కంపెనీ ప్రతినిధులు వ్యవహారం నడిపించారని పత్రిక కధనం చెబుతోంది. పాతబస్తీలోని ఓ అనామక అడ్రస్‌తో షెల్ కంపెనీని రిజిస్టర్ చేశారని, ఆ కంపెనీ పేరుతో రజత్ కుమార్ కుమార్తె పెళ్ళికి ప్రతినిధులు లక్షల్లో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఓ కంపెనీ ప్రతినిధులు ఈ చెల్లింపులు చేసినట్లు సమాచారం.
రజత్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవెలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రజత్ కుమార్ కూతురు పెళ్లి ఖర్చు వ్యవహారం కాస్త ఆలస్యంగా బయటికి రావడం సంచలనం రేపుతోంది. రజత్ కుమార్‌కి సంబంధించిన పాత విషయాలపై సామాజిక వేత్తలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
2018 ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఓట్ల మిస్సింగ్ విషయంపై పొరపాటని చెప్పి ప్రభుత్వానికి సాయం చేశారంటూ పరోక్ష విమర్శలు చేస్తున్నారు. రజత్ కుమార్ కూతురు వివాహానికి ఎవరు స్పాన్సర్ చేశారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ నిలదీశారు.
Who sponsored the five-star wedding of Telangana’s Special Chief Secretary (Irrigation) Rajat Kumar’s daughter?
Was it done as Quid pro quo?
— Revanth Reddy (@revanth_anumula) January 27, 2022