ధరలకు రెక్కలు రావడంతో మిడిసిపడుతున్న టమాటాను చూసి సామాన్యుడు ఒకింత ఆందోళన చెందుతున్నాడు కానీ కొనేందుకు సాహసం చేయడం లేదు. నోటికి రుచి తగలక.. ఎర్రటి పండు ఎప్పుడు కిందకు దిగి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు
టమాటా పప్పు, టమాటా పచ్చడి, టమాటా కూర, టమాటా చారు.. అబ్బా ఈ పేర్లు వింటుంటేనే నోరూరుతుంది కదా. అవును మరీ టమాటా ధరలు ఆకాశానికి నిచ్చెనేస్తుండటంతో అందని ద్రాక్ష పుల్లన కాదు తియ్యన చందంగా మారిపోయింది. దేశీయంగా కిలో టమాటా ధర రూ. 150 పై చిలుకు పలుకుతోంది. ధరలకు రెక్కలు రావడంతో మిడిసిపడుతున్న టమాటాను చూసి సామాన్యుడు ఒకింత ఆందోళన చెందుతున్నాడు కానీ కొనేందుకు సాహసం చేయడం లేదు. నోటికి రుచి తగలక.. ఎర్రటి పండు ఎప్పుడు కిందకు దిగి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ‘రానూ రానూ నేను రానూ కుదరదయ్యో’ అని నెల రోజుల నుండి మంకు పట్టు పట్టి కూర్చుంది ఈ నెరజాణ పండు. ఈ సమయంలో కొంత మంది టమాటాలతో వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో నూకాలమ్మ ఆలయంలో మళ్ల జగ్గ అప్పారావు, మోహినీ దంపతులు.. తమ కుమార్తె భవిష్యకు మొక్కు కింద 51 కిలోల టమాటాలను తులాభారం వేసిన సంగతి విదితమే. ఇప్పడు మరో తండ్రి తన కుమార్తె కోసం ఏకంగా 400 కిలోల టమాటాలను ఉచితంగా పంచిపెట్టాడు. ఇంతకు ఈ మహానుభావుడి ఊరు ఎక్కడ అనుకుంటున్నారా. తెలంగాణలోని పంజాగుట్ట వాసి. ప్రతాప్ నగర్‌కు చెందిన నల్ల శివ తన కుమార్తె పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని 400 కేజీలకు పైగా టమాటాలను స్థానికులకు ఉచితంగా పంచిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీన్ని చూసి నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.