వైట్ హౌజ్,వాషింగ్టన్ – అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు స్వాదీనం చేసుకోవడంతో అక్కడి పరిణామాలను పరిశీలిస్తున్నామని అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అఫ్ఘాన్ లో తాజా పరిస్థితులకు అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు అఫ్ఘనిస్తాన్ లో ఉన్న తన నాటో దళాలను అమెరికా ఉపసంహరించడం వల్లే తాలిబన్లు రెచ్చిపోయి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ అంశంలో జో బైడెన్ వైఖరిపై ఫైర్ అయ్యారు. ఇదిగో ఇటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వైట్‌హౌస్ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. అఫ్గనిస్తాన్ నుంచి తమ సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని బైడెన్ సమర్ధించుకున్నారు. తాము ఊహించిన దానికంటే త్వరగా తాలిబన్లు అఫ్గాన్ ప్రభుత్వాన్ని పడగొట్టారని ఆయన అన్నారు.
ప్రస్తుతం తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని, అఫ్గనిస్తాన్ లో మిగిలిన అమెరికా దళాలను వెనక్కి రప్పించడం ఒకటైతే, మరిన్ని సైనిక దళాలను అఫ్గాన్‌కు పంపి మళ్లీ యుద్ధాన్ని కొనసాగించడం రెండో మార్గమని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఐతే తాను మొదటి మార్గానికే మొగ్గుచూపుతున్నానని, సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు. ఐతే ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న అమెరికా పౌరులపై తాలిబన్లు దాడి చేస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ప్రెసిడెంట్ బైడెన్ హెచ్చరించారు.
అఫ్ఘనిస్తాన్ లో జాతి నిర్మాణం తమ బాధ్యత కాదన్న ఆయన, అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. అఫ్గన్ సైన్యానికి ఇరవై ఎళ్లుగా శిక్షణ ఇచ్చినా, అక్కడి ప్రభుత్వానికి మనోధైర్యం అందించినా, వాళ్లు సరైన సమయంలో పోరాట శక్తిని ప్రదర్శించలేకపోయారని బైడెన్ అన్నారు. అఫ్ఘనిస్తాన్ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని జో బైడెన్ స్పష్టం చేశారు.