హైదరాబాద్- అల్లు అర్జున్.. ఈ స్టైలిష్ స్టార్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోను ఇప్పుడు బన్నీ తాజా సినిమా పుష్ప డిసెంబర్ 17న విడుదలవుతోంది. దీంతో అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆదివారం హైదరాబాద్ లో పుష్ప ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఇదిగో ఇటువంటి సమయంలో అభిమానులతో కలవాలనుకున్నారట అల్లు అర్జున్. ఇందు కోసం హైదరాబాద్ శివారులోని కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాట్లు చేశారట కూడా.
అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలకు ముందు తన అభిమానులను కలుసుకోవాలని అనుకున్నారట. వారితో మాట్లాడి వారికి ప్రత్యేకంగా ఫొటో సెషన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకేముంది వెంటనే అల్లువారి అభిమాన సంఘాలకు సమాచారం అందించారు. తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ ను కలిసి ఫోటో దిగే ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి.

ఇలా సమాచారం అందగానే అలా భారీగా అభిమానులు వచ్చేశారు.జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ఓవైపు, మాధాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ కు మరోవైపు అభిమానులు తరలి వెళ్లారు. తమ అభిమాన హీరోతో ప్రత్యేకంగా ఫొటో తీసుకోవాలని ఎంతో ఆతృతతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్లంతా. ఎన్ కన్వెన్షన్ దగ్గర అభిమానులతో ఫొటోలు దిగాలని అల్లు అర్జున్ అనుకున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బన్నీ కార్యాలయం పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారట.
ఐతే అనుకున్న దానికంటే అభిమానులు ఎక్కువ రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. బన్నీ అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో బన్నీ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అభిమానుల సహనం హద్దు మీరడంతో ఎన్ కన్వెన్షన్ అద్దాలను పగల గొట్టేశారు. వెంటనే గీతా ఆర్ట్స్ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు ఎన్ కన్వెన్షన్ చేరుకుని అభిమానులను పంపేశారు. పుష్ప సినిమా విడుదల తర్వాత అభిమానులతో ఫోటో సేషన్ నిర్వహించాలని అల్లు అర్డున్ భావిస్తున్నారని సమాచారం.
