రూ. 2వేల నోట్లు పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ. 2వేల నోటును క్రమక్రమంగా చలామణీలోంచి వెనక్కి తీసుకునేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. రూ.వెయ్యి, రూ.500 పాత నోట్లను రద్దు చేసి సంచలనానికి తెరలేపారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇక, అప్పుడే రూ.2 వేల నోటును ముద్రించింది ఆర్బీఐ. చిల్లర కష్టాలు రుచిచూపించగా ఆ తర్వాత రూ.500 కొత్త నోటు, రూ.200 కూడా వచ్చేశాయి. క్రమంగా అన్ని నోట్లు రంగులు మారుతూ పోయాయి. సైజులు కూడా తగ్గిపోయాయి. మరోవైపు రూ.2000 నోట్లు కూడా రద్దు కానున్నాయా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇందులో భాగంగానే గత రెండేళ్లుగా వీటి ముద్రణ ఆపేసిన కేంద్ర బ్యాంకు.. నోట్ల చలామణీని కూడా తగ్గిస్తూ వస్తోంది.
2018 మార్చి నాటికి 336.3కోట్ల రూ. 2వేల నోట్లు చలామణీలో ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ సంఖ్య 245.1 కోట్లకు పడిపోయింది. ఈ మేరకు ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంటే దాదాపు 91.2కోట్ల నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకుందన్నమాట. విలువ పరంగా రూ. 57,757 కోట్ల రూ. 2వేల నోట్లు చలామణీ నుంచి వెళ్లిపోయాయి.2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ. 2వేల నోటును కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే వ్యవస్థలో పెద్ద నోట్లపై ఆధారపడే అవసరాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంచాలనే ఉద్దేశంతో ఈ నోట్లను తగ్గించాలని కేంద్ర బ్యాంకు భావించింది. 2018 మార్చి నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి పరిమాణం 3.27శాతం కాగా 2021 మార్చి నాటికి అది 2శాతానికి పడిపోయినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అలాగే మొత్తం కరెన్సీ విలువలో రూ. 2వేల నోట్ల విలువ 37శాతం నుంచి 17.78శాతానికి తగ్గింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల మొత్తం కరెన్సీ విలువలో రూ. 500, రూ. 2వేల నోట్ల వాటా 85.7శాతంగా ఉందని ఆర్‌బీఐ నివేదికలో చెప్పింది. కొవిడ్ మహమ్మారి, ఆంక్షల నేపథ్యంలో నగదు వినియోగం పెరిగిందని, దీంతో బ్యాంకు నోట్లకు డిమాండ్ ఎక్కువైనట్లు తెలిపింది. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త నోట్ల సరఫరా కూడా చేపట్టామని, కరెన్సీ చెస్ట్‌ల్లో సరిపడా నిల్వలు ఉండేలా చూసుకున్నామని పేర్కొంది.