పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇది పేరు కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ చెరిగిపోని బ్రాండ్. ఆయన ఏదైనా సినిమా స్టార్ట్ చేయడం లేటు.. టైటిల్ దగ్గర నుంచి స్టోరీ వరకు ప్రతిదీ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకు తగ్గట్లే పవన్ కూడా తన ఇమేజ్ కు సరిపోయే, ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే స్టోరీస్ తో సినిమాలు తీస్తుంటారు. అలా ప్రస్తుతం చేస్తున్న మూవీ ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో తీస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో? పవన్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాలు పక్కనబెడితే అసలు ఎవరీ ‘హరిహర వీరమల్లు’ అనేది తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ లో రాజులు, యుద్ధాలు.. ఇలాంటి స్టోరీతో సినిమా అనగానే అందరికీ ఫస్ట్ ‘బాహుబలి’ గుర్తొస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ రాజమౌళి.. అలాంటి బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. వరల్డ్ వైడ్ వేల కోట్ల కలెక్షన్లతో కేక పుట్టించారు. ఈ మూవీ తర్వాత చాలామంది డైరెక్టర్స్ పీరియాడిక్ స్టోరీలతో సినిమాలు చేస్తున్నారు. అలా పవన్ కల్యాణ్ తో డైరెక్టర్ క్రిష్ తీస్తున్న సినిమానే ‘హరిహర వీరమల్లు’. విజయనగర సామ్రాజ్యాధినేత అయిన ఈయన జీవితంలో ఓ సినిమాకు సరిపడా అద్భుతమైన అంశాలున్నాయి. ఇంతకీ అవేంటి? అసలు ‘హరిహర వీరమల్లు’ ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
900 ఏళ్ల క్రితం అంటే.. క్రీ.శ. 11వ శతాబ్దంలో మన దేశం చాలా సమస్యలని ఎదుర్కొంది. భారత్ లో ఇస్లాం మత వ్యాప్తికి, సంపద కొల్లగొట్టడానికి మహమ్మదీయ సుల్తానులు.. వాయువ్య సరిహద్దు నుంచి మన దేశంలోకి చొరబడ్డారు. క్రీ.శ 13వ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేశారు. ఇక క్రీ.శ 1325లో మహ్మద్ బిన్ తుగ్లక్ దిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత మన దేశ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. హిందువుల ఇళ్లు, ఆస్థానాలు, రాజమందిరాలు, దేవాలయాలని చాలావరకు ధ్వంసం చేస్తూ వచ్చారు. క్రీ.శ 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పుడు.. అక్కడ రెండో ప్రతాపరుద్రుడు ఆస్థానంలో కోశాధికారులుగా చేస్తున్న హరిహర, బుక్క సోదరులు.. కంపిలకు వెళ్లిపోయి, అనిబుడ్డి సంస్థానంలో చేరారు. వీరు సంగమ వంశానికి చెందినవారు. అప్పటి రాజైన కంపిల దేవ.. వీళ్లకు ఆశ్రయం ఇచ్చారు. క్రీ.శ 1326లో తుగ్లక్.. కంపిలని స్వాధీనం చేసుకున్నప్పుడు హరిహర, బుక్క సోదరులని బంధించి దిల్లీకి తీసుకెళ్లిపోయారు.
ఇక దిల్లీ తీసుకెళ్లిపోయిన తర్వాత ఇద్దరు సోదరుల్ని కూడా బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. అయితే కొన్నాళ్ల తర్వాత కంపిలలో ప్రజలు అసంతృప్తితో తిరుగుబాటు చేసినప్పుడు.. హరిహర, బుక్క సోదరులకు వేర్వేరుగా సైన్యాల్ని ఇచ్చి మరీ కంపిలను తిరిగి స్వాధీనం చేసుకురమ్మని తుగ్లక్ ఆదేశించాడు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు.. కంపిలని స్వాధీనపరుచుకుని స్వాతంత్ర్యం ప్రకటించారు. క్రీ.శ 1336లో స్వతంత్ర్య రాజ్యాన్ని అనిగొండులో హరిహర స్థాపించాడు. అలా కొంతకాలం తర్వాత ఈ ఇద్దరూ సోదరులు… శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావంతో తిరిగి హిందు మతాన్ని స్వీకరించి, సుల్తాన్ ని ఎదురించి విజయనగర సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని, సమర్థమైన రాజ్యం ఏర్పాటు చేసుకోవడం హరిహర… తన మొదటి కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తన రాజ్యం భద్రత కోసం బాదామి, ఉదయగిరి, గుత్తి, అనిగొండు కోటలను బలోపేతం చేసుకున్నాడు.
రాజ్యం భద్రత దాని కోటలపై ఆధారపడి ఉంటుందని హరిహర.. బలంగా నమ్మేవాడు. తుంగభద్ర నది ఉత్తర ఒడ్డున్న ఉన్న అనిగొండి.. సరైనది కాదని భావించాడు. ఎందుకంటే దశాబ్ద కాలంలో రెండుసార్లు అది శత్రువుల దాడికి గురైంది. దీంతో ఇది హిందు రాజ్యానికి రాజధానిగా సురక్షితమైనది కాదని హరిహర అనుకున్నాడు. రాజధాని శత్రువులకు అందుబాటులో ఉండకూడదని భావించి.. హేమకూట పర్వతం చుట్టూ.. విరూపాక్ష ఆలయ పరిసరాల్లో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న స్థలాన్ని కొత్త రాజధాని కోసం ఎంచుకున్నాడు. తన సోదరుడు, కుడి భుజమైనా బుక్క.. ఆ పనిని తన భుజ స్కంధాలపై వేసుకుని, కేవలం ఏడేళ్లలో అంటే 1343లో సామ్రాజ్య నిర్మాణం పూర్తి చేయించాడు. 1344 నాటికి రాజధాని అనిగొండి నుంచి విజయనగరానికి మార్చేశారు. క్రీ.శ 1340 తర్వాత పెనుగొండ కోటను హోయసలా రాజ్యం నుంచి స్వాధీనం చేసుకున్న హరిహర.. తన ప్రాంతీయ ప్రధాన కేంద్రంగా చేసుకున్నాడు. క్రీ.శ 1342లో మధురై సుల్తానుతో జరిగిన యుద్ధంలో మూడో భళ్లాలుడు మరణించాడు. 1346 నాటికి కోశల సామ్రాజ్యం మొత్తం విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశారు. వీరహరిహర కాలంలో ఇది అత్యంత గుర్తు పెట్టుకోవాల్సిన విజయం.
1346 కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు.. రెండు సముద్రాల మధ్య భాగానికి రాజు అని, ఆయన సామ్రాజ్య రాజధాని విద్యానగరం అని అందులో చెప్పేవారు. హరిహర, బుక్క సోదరులకు చెందిన రాజవంశాన్ని.. సంగమ రాజవంశం అని అప్పట్లో పిలిచేవారు. ఇకపోతే హరిహరకు.. కంపన, బుక్క, మరప్ప, మడప్ప అని నలుగురు సోదరులు కూడా ఉన్నారు. కొత్తగా స్థాపించిన రాజ్యాన్ని ఏకీకృతం చేయడానికి, విస్తరించడానికి.. సోదరులందరూ కూడా హరిహరకు చాలా సాయం చేసేవారు. ఇలా వీర హరిహర స్థాపించిన విజయనగర రాజ్యం అతడి వారసుల కింద శక్తివంతమైన సామ్రాజ్యంగా విస్తరించింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైనే.. తిరుగులేని సుసంపన్న సామ్రాజ్యంగా వర్థిల్లింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. స్టోరీలో హై ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. హరిహర పాలన, ఆయన యుద్ధనీతి, వ్యూహాలు లాంటి వాటిని తెరపై సరైన రీతిలో ఆవిష్కరించాలే గానీ బాక్సాఫీస్ బద్దలైపోవడం గ్యారంటీ. అయితే ఉన్నది ఉన్నట్లు సినిమాగా తీస్తారా.. లేదా ఏమైనా కల్పిత పాత్రలు జోడించారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మీలో ఎంతమంది పవన్ ‘హరిహర వీరమల్లు’ కోసం వెయిటింగ్? అలానే పైన చెప్పిన స్టోరీ మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.