టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. ఇండస్ట్రీలో విజయానికి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచాడు రాజమౌళి. జక్కన్న సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన చాలు అనుకునే వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌కే పరిమితం అయిన జక్కన్న క్రేజ్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా దర్శకుడు అయ్యాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ హాలీవుడ్‌కి చేరింది. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ బరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఓ హాలీవుడ్ మ్యాగ్జైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘నేను డబ్బుల కోసమే సినిమాలు చేస్తాను గానీ విమర్శకుల ప్రశంసల కోసం కాదు. ఆర్ఆర్ఆర్ కమర్షియల్ సినిమా. నా సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లను సాధిస్తే చాలా సంతోషిస్తాను. కలెక్షన్లు మాత్రమే కాక అవార్డులు కూడా వస్తే ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. అవార్డులు అనేవి మా యూనిట్ పడిన కష్టానికి ప్రతిఫలం. అవార్డుల విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
అలానే తన హాలీవుడ్ ప్లాన్స్ గురించి కూడా ఈ సందర్భంగా వెల్లడించాడు రాజమౌళి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అందరు ఫిలిం మేకర్స్ లాగే నేను కూడా హాలీవుడ్లో సినిమా తీయాలని కలలు కంటున్నాను. వెస్టర్న్ ఇండస్ట్రీలో ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే హాలీవుడ్లో ప్రాజెక్ట్ చేయడానికి బలమైన సహకారం అవసరం. అయితే భారతీయ సినిమాల ఫిల్మ్ మేకింగ్‌లో మాత్రం నాకు ఇతరుల డైరెక్షన్ అవసరం లేదు. ఇక నాకు నచ్చిన ‘ప్రిన్స్ ఆఫ్ పర్షియా’ వీడియో గేమ్ సిరీస్‌కు అనుగుణంగా దర్శకత్వం వహించాలని నాకు ఆసక్తి ఉంది’’ అని తెలిపారు.
ట్రిపుల్ ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట.. గోల్డెన్ గ్లోబ్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ అందుకుంది. అలానే క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ 2023లో ట్రిపుల్ ఆర్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీల్లో అవార్డ్స్ గెలుచుకుంది. ఇక ప్రస్తుతం ఈ నెల 24న జరగనున్న ఆస్కార్ నామినేషన్ల ప్రకటనపైనే అందరి దృష్టి ఉంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడింది. మరి నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకుంటుంది అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.