పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తారు. మిగతా హీరోల్లా స్ట్రైట్ సినిమాలు చేయవచ్చు కదా అని కొంతమంది విమర్శిస్తుంటారు. పవన్ స్ట్రైట్ సినిమాలు చేయలేక కాదు. దానికి వేరే కారణం ఉంది. కథలకు కొదవా ఇండస్ట్రీలో. అయినా గానీ రీమేక్ సినిమాలే ఎందుకు చేస్తున్నారు అంటే దానికొక లెక్క ఉంది. ఆ లెక్క తెలియాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే.
పవన్ కళ్యాణ్ ఈ పేరు ఒక ప్రభంజనం. సినిమాల్లో పవన్ కళ్యాణ్ కటౌట్ ఉంటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ పవన్ క్రేజ్ అనేది వేరే లెవల్. సినిమాలు హిట్టయినా, ఫ్లాపయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం ఆకాశంలా అలానే ఉంటుంది. అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో పవన్ స్టైలే వేరు. అయితే ఒకప్పటిలా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రెండ్ సెట్టర్, ఇండస్ట్రీ హిట్స్, మాస్ క్రేజ్, విపరీతమైన ఫ్యాన్ బేస్ లాంటివి ఎప్పుడో పవన్ టచ్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ప్రతీ హీరో పాన్ ఇండియా లెవల్ లో తన సత్తా చూపించుకుంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా రీమేక్ ల దగ్గరే ఆగిపోయారన్న విమర్శలైతే వస్తున్నాయి. రీమేక్ లు చేయడానికి కారణం ఏంటి? అనేది ఆయనను సరిగ్గా అర్థం చేసుకునే అభిమానులకు తెలుస్తుంది తప్ప బయట వారికి తెలియదు. నిజానికి పవన్ అడగాలే గానీ రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు పెద్ద పెద్ద సబ్జెక్టులు సిద్ధం చేయగలరు. అది పవన్ కెపాసిటీ. అసలు పవన్ అడగాల్సిన పనే లేదు. హింట్ ఇస్తే చాలు, సాయంత్రానికి దర్శకులు పవన్ ఇంటి ముందు క్యూ కడతారు. డేట్స్ ఇస్తే చాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆయన కాలి దగ్గరకు వస్తాయి. కానీ అవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ అని పవన్ కి తెలుసు. రాజమౌళితో సినిమా చేయలేక కాదు, సినిమా చేస్తే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా సినిమాకే కేటాయించాలి.
అలా చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి? ప్రజా సేవ చేయాలనే కదా పార్టీ పెట్టింది. పార్టీ నిలబడాలంటే డబ్బులు ఉండాలి కదా. పార్టీని నడపాలంటే పవన్ కి వ్యాపారాలు లేవు. పోనీ ఏవేవో కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి కోట్లు సంపాదిద్దాం.. ఆ సొమ్ముతో పార్టీని పోషించుకుందాం అన్న ఆలోచన లేదు. ఆలోచన అనడం కంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి నాకొద్దు అని పవన్ అనుకున్నారని చెప్పవచ్చు. ఈరోజు ఒక్క సంతకం పెడితే సినిమాల కంటే ఎక్కువగా కార్పొరేట్ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా వందల కోట్లు సంపాదించవచ్చు. కానీ పవన్ వ్యక్తిత్వం అది కాదు. ఒక చోట తప్పు చేసి ఇంకో చోట సరిదిద్దుకునే రకం కాదు. అక్కడ చీమని చంపి.. ఇక్కడ చీమకి ప్రాణం పోసి లెవల్ అయిపోయిందనుకునే వ్యక్తిత్వం అస్సలు కాదు. ఏం చేసినా న్యాయబద్ధంగా సంపాదించినదై ఉండాలి. అది ప్రజాక్షేమాన్ని కాంక్షించి రాజకీయాలకు వెచ్చించాలి. అదే పవన్ నమ్మిన బలమైన సిద్ధాంతం.
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు చేయాలి. సుదీర్ఘ కాలం పాటు పార్టీలు నిలబడాలంటే డబ్బు ముఖ్య భూమిక పోషిస్తుందనేది జగమెరిగిన సత్యం. దానికి తోడు ప్రజా సేవ ఒకటి. కష్టం వచ్చిందని వస్తే చాలు సాయం చేయడానికి ఎగబడి వెళ్ళిపోతారు పవన్. ప్రజలకు, రైతులకు సంపాదించిన డబ్బులని పంచిపెట్టేస్తారు. ఇన్ని చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? ఎన్ని సినిమాలు చేస్తే ప్రజా సేవ చేయాలన్న ఆకలి తీరుతుంది? రీమేక్ సినిమాలు ఎంచుకోవడానికి కారణం ఇదే. ఆల్రెడీ ఉన్న కథ కాబట్టి దాని మీద ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది. తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఎక్కువ సమయాన్ని ప్రజల కోసం కేటాయించాలి. ఈ కారణంగానే పవన్ రీమేక్ సినిమాలు ఎంచుకుంటున్నారు.
కాటమరాయుడు, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు గానీ.. పవన్, సాయి ధరం తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గానీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు గానీ ఇలా పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడం వెనుక ఉన్న కారణం పాలిటిక్స్ మాత్రమే. అటు వృత్తిపరంగా సినిమాలను, ఇటు ప్రవృత్తి పరంగా రాజకీయాలను రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే సినిమాల్లో, రాజకీయాల్లో గానీ ఖచ్చితమైన ఫోర్స్ అనేది మిస్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పవన్ కున్న కెపాసిటీకి ఈపాటికే ఒక సాలిడ్ సినిమా పడాలి. పవన్ ఫ్యాన్స్ ఆశించేది కూడా అదే. కానీ పవర్ ప్యాక్ సినిమా చేసే కెపాసిటీ ఉన్నా కూడా పవన్ పాలిటిక్స్ కోసం ఆలోచించి ఆగిపోతున్నారు.
పవన్ ని అర్థం చేసుకున్న ఫ్యాన్స్ కూడా ఆయన రీమేక్ సినిమా చేసినా సరే స్వీకరిస్తున్నారు. బాస్ కి మనల్ని ఎంటర్టైన్ చేయడం కంటే కూడా జనాన్ని ఎడ్యుకేట్ చేయడమే ముఖ్యం అని అర్థం చేసుకుని.. ఆయన ఏం చేసినా, ఎలా చేసినా గానీ వెనుకే ఉంటున్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా డైవర్ట్ అవ్వకుండా ఫోకస్డ్ గా ఉంటున్నారు. అసలు మామూలుగా వేరే హీరోలు ఎవరైనా ఇలా చేస్తే అభిమానులు డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంది. కానీ పవన్ విషయంలో మొదటి సినిమా నుంచి ఒకేలా ఉంటూ వచ్చారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కి ఓపిక చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఇది అభిమానం కాదు, భక్తి. భక్తులైతేనే ఇంత ఓపిక, సహనం కలిగి ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ కి భక్తుడిగా ఉండడం అంత ఈజీనా మీరు చెప్పండి. ఈ విషయంలో ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే రీమేక్ సినిమాలు ఎందుకు చేస్తున్నారో అని తెలియని వారికి షేర్ కూడా చేయండి.