బాగా డబ్బు సంపాదించినవారు శ్రీమంతులు కాదు, సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగిచ్చేవారే అసలైన శ్రీమంతులు అని శ్రీమంతుడు సినిమా ద్వారా మహేష్ బాబు, కొరటాల శివ చెప్పారు. దీన్ని నిజం చేస్తూ చాలా మంది తాము సంపాదించిన దాంట్లో సమాజానికి కొంత తిరిగి ఇచ్చేస్తున్నారు. వీళ్ళకేమైనా పిచ్చా అనుకునేవాళ్లు ఉంటారు. అవును వీళ్లకి సమాజానికి ఏమైనా చేయాలన్న పిచ్చి. తరగని ఆస్తి, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు ఎన్ని ఉన్నా కూడా ఇవేమీ తృప్తినివ్వని పేదవాళ్ళు వీళ్ళు. సమాజం నుంచి చాలా తీసుకున్నామని చెప్పి, సమాజానికి తిరిగిచ్చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది ఐతే ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు.
తాజాగా ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు ఏకంగా 50 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. అది కూడా అనారోగ్యం ఉన్నా కూడా లెక్క చేయకుండా పర్వతాన్ని అధిరోహించారు. ఎన్నారై జానీ అలియాస్ జనార్ధన్ అమెరికాలో ఉంటారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. యూఎస్ లో ఉండే జనార్థన్.. క్యాన్సర్ రోగుల కోసం ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. అది కూడా 50 ఏళ్ల వయసులో. అందులో మళ్ళీ ఆయనకు షోల్డర్ ఆర్థరైటిస్ ఉంది. ఆక్సిజన్ 30 శాతం మాత్రమే ఉండే కిలిమంజారో పర్వతాన్ని టెంపరేచర్ మైనస్ డిగ్రీల్లో ఉన్నా కూడా లెక్క చేయకుండా 7 రోజుల పాటు పర్వతాన్ని అధిరోహించారు.
క్యాన్సర్ అవగాహనలో భాగంగా ఫండ్స్ రైజ్ చేయడం కోసం పర్వతాన్ని అధిరోహించినట్లు ఆయన తెలిపారు. తానా, బసవతారకం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చాలా మంది స్పందించి కోటి రూపాయల వరకూ ఫండ్స్ ఇచ్చారని అన్నారు. ఆ డబ్బుతో క్యాన్సర్ రోగుల చికిత్సకు కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుగోలుకు ఉపయోగించినట్లు తెలిపారు. రెండేళ్లలో వేరే ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈసారిలా ఒకే హాస్పిటల్ కి కాకుండా వివిధ హాస్పిటల్స్ కి ఫండ్స్ రైజ్ చేద్దామని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గుండె జబ్బులు ఉన్న చిన్న పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణలో చేసినట్టే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపారు. 2024 డిసెంబర్ కల్లా 2 కోట్లు ఫండ్స్ రైజ్ చేసి పలు హాస్పిటల్స్ లో పిల్లలకి హార్ట్ సర్జరీ చేయిస్తామని అన్నారు. ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఆయన వచ్చాక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారని అన్నారు. ఇంకా చాలా విషయాలను ఆయన వెల్లడించారు. అనారోగ్యం ఉన్నా కూడా 50 ఏళ్ల వయసులో క్యాన్సర్ రోగుల కోసం రిస్క్ చేసి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన జనార్ధన్ కి కృతజ్ఞతలు. ఇలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం. మరి ఈ శ్రీమంతుడికి ఒక థాంక్స్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసేలా ఆయన్ని ఆశీర్వదించండి. ఆయన గురించి తెలుసుకునేందుకు ఈ కింది వీడియో చూడగలరు.