‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంతో అందరూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ గురించి మాత్రం పెద్దగా వినిపించడం లేదు. ఆయన స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
‘నాటు నాటు’.. ఇప్పుడు ప్రపంచం అంతటా మారుమోగుతున్న పాట. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సాంగ్ అందరి ఫేవరెట్ అయిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ ఆడియెన్స్‌కూ ఇష్టమైన పాటగా మారిపోయింది ‘నాటు నాటు’. ఇప్పుడు ఆస్కార్ రావడంతో దునియా మొత్తం ఇదే పాట వినిపిస్తోంది. అంతలా అందర్నీ కట్టిపడేసిన ఈ పాటలోని లిరిక్స్, మ్యూజిక్‌తో పాటు డ్యాన్స్ గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. ‘ఆర్ఆర్ఆర్’ కోసం 19 నెలలు కష్టపడిన చంద్రబోస్ 20 పాటలు రాసి రాజమౌళి చేతికి ఇచ్చారు. అందులో నుంచి ఆయన ‘నాటు నాటు’ను ఎంచుకున్నారు.
నాలుగున్నర నిమిషాల ‘నాటు నాటు’ పాట చిత్రీకరణకు దాదాపుగా 20 రోజులు పట్టింది. దీనికి 43 రీటేక్‌లు అవసరం అయ్యాయి. ఇద్దరు మిత్రుల మధ్య వచ్చే ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ ముందునుంచీ నమ్మింది. పాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ డ్యాన్స్‌తో అందర్నీ ఉర్రూతలూగించారు. నృత్యం చేసిన చెర్రీ, తారక్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ అయిన ప్రేమ్ రక్షిత్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. మిగిలిన కొరియోగ్రాఫర్స్ మాదిరిగా ఆయన టీవీ షోల్లో కనిపించరు. మీడియా ముందుకూ పెద్దగా రారు. పని తప్ప ప్రచారాన్ని పట్టించుకోని ప్రేమ్ రక్షిత్.. తాను నమ్ముకున్న రంగంలో ప్రాణం పెట్టి పనిచేసి ఈస్థాయికి చేరుకున్నారు.
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ కొరియోగ్రాఫర్లలో ప్రేమ్ రక్షిత్ ఒకరు. అలాంటి వ్యక్తి ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారు. ఆయన కథ టూకీగా చెప్పుకోవాలంటే.. ప్రేమ్ రక్షిత్ తండ్రి వజ్రాల వ్యాపారం చేసేవారు. 1993లో కుటుంబ విభేదాల కారణంగా ఆయన ఆస్తులు పోగొట్టుకున్నారు. దీంతో ఆర్థికంగా చితికిపోయిన ఆయన డ్యాన్స్ అసిస్టెంట్‌గా మారారు. ఆ సమయంలో ప్రేమ్ రక్షిత్ ఓ టైలర్ షాప్‌లో పనిచేసేవారు. డ్యాన్స్ మీద ఇష్టం ఉండటంతో ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా ప్రయత్నాలు చేశారు. కానీ అవకాశాలు రాలేదు. పేదరికంతో విసిగిపోయిన ప్రేమ్ రక్షిత్ బతకలేనని భావించి.. చెన్నైలోని మెరీనా బీచ్‌కు ఓ సైకిల్ వేసుకుని వెళ్లారు. అక్కడ సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు.
ప్రేమ్ రక్షిత్ ఆత్మహత్యకు ప్రయత్నించడానికి ఓ కారణం ఉంది. తాను చనిపోతే డ్యాన్స్ ఫెడరేషన్ వాళ్లు.. పేదరికంతో బాధపడుతున్న తన కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తారని ప్రేమ్ రక్షిత్ అనుకున్నారు. అయితే సరిగ్గా ఆత్మహత్య చేసుకునే టైమ్‌లో ఆయనకు ఒక విషయం గుర్తొచ్చింది. తాను బీచ్‌కు వేసుకుని వచ్చిన సైకిల్ పక్కింటి వాళ్ల నుంచి అరువుకు తెచ్చుకున్నానని ప్రేమ్ రక్షిత్‌కు గుర్తొచ్చింది. తాను చనిపోతే సైకిల్ యజమాని తన ఫ్యామిలీని ఇబ్బంది పెడతాడని అనిపించి.. సైకిల్ ఇంటి వద్ద ఇచ్చేసి, మళ్లీ వద్దామని ఇంటికి చేరుకున్నాడు ప్రేమ్ రక్షిత్. అయితే ఇంటికి రాగానే.. ప్రేమ్ రక్షిత్‌కు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసే చాన్స్ వరించిన విషయాన్ని తండ్రి చెప్పాడు. దీంతో ఎగిరి గంతేడాశాడు ప్రేమ్ రక్షిత్. అక్కడి నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ సినిమా కొరియోగ్రఫీ మీద తనదైన ముద్ర వేశారాయన.