ఇటీవలి కాలంలో తరచూ విన్పిస్తున్న మాట స్ట్రోక్. ఇది చాలా ప్రమాదకరమైంది. అత్యధిక కేసుల్లో ప్రాణాలు పోతుంటాయి. అసలు స్ట్రోక్ అంటే ఏంటి, ఇది వచ్చే ముందు ఏమైనా లక్షణాలు కన్పిస్తాయా, అవి ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం.
నిత్య జీవితంలో ఎదుర్కొనే చాలా రకాల అనారోగ్య సమస్యలకు అవి సాధారణమైనవి కావచ్చు, ప్రాణాంతకమైనవి కావచ్చు ముందుగా శరీరం కొన్ని సంకేతాలు తప్పక పంపిస్తుంటుంది. కొంతమంది ఈ లక్షణాల్ని తేలిగ్గా తీసుకుంటారు. మరి కొందరు సీరియస్‌గా పరిగణిస్తారు. అదే విధంగా అత్యంత ప్రమాదకరకమైన స్ట్రోక్ వచ్చే ముందు కూడా శరీరం కొన్ని భయంకర సంకేతాలు ఇస్తుంటుంది. ముఖ్యంగా 4 రకాల సంకేతాలు వస్తాయి. వీటిని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. తేలిగ్గా తీసుకోకూడదు. సకాలంలో ఈ సంకేతాల్ని పసిగట్టి వైద్యుని వద్దకు వెళితే వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.
చాలామంది స్ట్రోక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్‌ను అకస్మాత్తుగా జరిగే పరిణామంగా భావిస్తారు. కానీ వాస్తవానికి అంతకంటే ముందే కొన్ని సంకేతాలు వెలువడుతాయి. స్ట్రోక్ అనేది మెదడుకు సరఫరా అయ్యే రక్తంలో అంతరాయం కలగడం. ఇదొక తీవ్ర పరిస్థితి. ఇలా జరిగితే మెదడు కణాలు దెబ్బతింటాయి. లేదా స్థబ్దుగా మారతాయి. ఈ పరిస్థితుల్లో తక్షణం మెడికేషన్ ఉండాలి. చాలా సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది.
స్ట్రోక్ వచ్చే ముందు కన్పించే లక్షణాలు
అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఎంతకీ తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. మెదడులో రక్తం గడ్డ కట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు. వికారం లేదా సరిగ్గా చూడలేకపోయినా లేదా తలనొప్పితో వాంతుల సమస్య ఉన్నా తేలిగ్గా తీసుకోవద్దు. ఏ కారణం లేకుండా అదే పనిగా ఎక్కిళ్లు వస్తుంటే నిర్లక్ష్యం వద్దు. ఇది మెదడుకు సంబంధించింది కావచ్చు. బలహీనత, మాట్లాడటంలో సమస్య, శరీరంలో వింతగా ఉన్నా వైద్యుడిని సంప్రదించాలి.
ప్రతి ఛాతీ నొప్పికి గ్యాస్ లేదా ఎసిడిటీ కారణం కానే కాదు. మెదడులోని రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, ఆక్సిజన్ తగ్గడం జరిగితే ఛాతీ నొప్పి వస్తుంది. అందుకే ఛాతీ నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు. మెదడులో ఒత్తిడి అకస్మాత్తుగా పెరిగి వికారం వంటివి సంభవించినా నిర్లక్ష్యం చేయవద్దు. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుకుంటే ఇలాంటి పరిస్థితుల్ని నివారించవచ్చు.