ఐసీసీ వన్డే ప్రపంచకప్ తిరిగి జరిగేది 2027లో. టీమ్ ఇండియాకు సారధ్యం వహించేది రోహిత్ శర్మేనా అంటే కావచ్చనే అన్పిస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీమ్ ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటన ఉంది. ఆ దేశంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డేలు ఆడుతుంది. 2026 జూలై 1న ప్రారంభమై 19వ తేదీన ముగుస్తుంది. ఇది ఐసీసీ అధికారిక షెడ్యూల్. దీనికి సంబంధించి ఐసీసీ ఓ పోస్టర్ విడుదల చేసింది. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా హారీ బ్రూక్ ఫోటో ఉంటే టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా రోహిత్ శర్మ ఫోటో ఉంది. అందుకే ఇప్పుడీ ఫోటో అంతగా చర్చనీయాంశమౌతోంది. ఎందుకంటే వచ్చే ఏడాది ఇంగ్లండ్ సిరీస్‌కు రోహిత్ ఆడే పరిస్థితి ఉంటే..ఆ తరువాత మరో ఏడాదికి జరిగే వన్డే ప్రపంచకప్ కూడా కచ్చితంగా ఆడవచ్చు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027లో అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఉంటుందని అంచనా. వచ్చే ఏడాది ఇంగ్లండ్ సిరీస్ ఆడగలిగితే ఆ తరువాత మరో ఏడాది ఫిట్‌నెస్ కొనసాగించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అందుకే ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
రోహిత్ శర్మ ఇప్పటితకే టీ20, టెస్ట్ ఫార్మట్‌కు గుడ్ బై చెప్పాడు. పస్తుతం వన్డే ఫార్మట్ ఒక్కటే ఆడుతున్నాడు. 2027 ప్రపంచకప్ ఆడటం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంకా రెండేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నందున అప్పటి వరకూ అటు ఫిట్‌నెస్ ఇటు ఫామ్ రెండూ కాపాడుకోవాలి. ఇది సాధ్యమయ్యేనా అనే సందేహాలు వస్తున్నాయి. అసలు వచ్చే ఏడాది వరకు ఆడకపోవచ్చనే వార్తల నేపధ్యంలో ఐసీసీ తాజా పోస్టర్ ఆసక్తి రేపుతోంది.
ఐసీసీ పోస్టర్ సంగతి ఎలా ఉన్నా..రోహిత్ అప్పటి వరకు ఉంటాడో లేదో తెలియకపోయినా టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఇప్పటికే ఓ ప్రణాళిక స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచకప్ కంటే ముందు టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెడుతున్నామని, బాగా ఆడుతుంటే వయసు అడ్డంకి కాదని చెప్పాడు. అందుకే రోహిత్ ఫ్యాన్స్‌లో కొత్త చర్చ మొదలైంది. ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఫామ్ కొనసాగిస్తే కచ్చితంగా 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడని నమ్ముతున్నారు.