సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అడుగెట్టిన మహేశ్ బాబు ఆ పేరు సార్ధకం చేసుకున్నాడు. ఇవాళ ఆగస్టు 9న 50వ ఏట అడుగెట్టిన మహేశ్ బాబు సినీ కెరీర్‌లో టాప్ 10 సినిమాల గురించి ఓసారి తెలుసుకుందాం.
టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎన్నో విజయాల్ని చేజిక్కించుకుని 50వ ఏట అడుగెట్టిన మహేశ్ బాబుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1999లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడిగా హీరోగా పరిచయమైనప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్‌కు నిజమైన బిజినెస్ మ్యాన్ అన్పించుకున్నాడు. ఇక కమర్షియల్ యాడ్స్‌లో మహేశ్ బాబుదే అగ్రస్థానం. 50వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మహేశ్ బాబుకు సినీ నటులు చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ సహా అంతా శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇక మహేశ్ బాబు సినీ కెరీర్‌లో టాప్ 10 సినిమాల గురించి కొన్ని వివరాలు…
ఎప్పుడొచ్చామన్నది కాదు..బుల్లెట్ దిగిందా లేదా అంటూ మోస్ట్ పాపులర్ డైలాగ్‌తో దుమ్ము రేపిన పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి మహేశ్ బాబు కెరీర్‌లో టాప్ సినిమా. ఇక శ్రీను వైట్ల తెరకెక్కించి మరో సూపర్ హిట్ సినిమా దూకుడు. పేరుకు తగ్గట్టే కలెక్షన్లలో దూకుడు చూపించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతులు అందర్నీ శ్రీమంతులు చేసింది. ఇక మహేశ్ బాబు స్టామినాను చూపించిన మరో సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు. కృష్ణవంశీ తెరకెక్కించిన మురారి సినిమా మహేశ్ కెరీర్‌లో మొదటి బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు.
టాలీవుడ్‌లో మొదటి కల్ట్ క్లాసికల్ చిత్రంగా భారీ హిట్ సాధించిన మరో చిత్రం త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. కొరటాల శివతో మరోసారి తెరకెక్కించిన సినిమా భరత్ అనే నేను బాక్సాఫీసు కలెక్షన్లు కొల్లగొట్టింది. మహేశ్ బాబు అల్లరి నరేష్‌తో కలిసి చేసిన మహర్షి కూడా మహేశ్ బాబు కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా చెప్పవచ్చు. ఇక ముందు చెప్పినట్టే హీరోగా మహేశ్ బాబు మొదటి చిత్రం రాజకుమారుడు.