వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పవన్ – మహేశ్ మధ్య హోరాహోరీగా పోరు సాగబోతుంది. పోయిన పొంగల్ రేసులో మహేశ్-బన్నీ మధ్య సాగిన సంక్రాంతి సమరం ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఇక.. రాబోయే సంక్రాంతికి దానికి మించిన రీతిలో బాక్సాఫీస్ పోరు ఉండబోతుందనే అంచనాలు మొదలయ్యాయి. మహేశ్ బాబు – పరశురామ్ ‘సర్కారు వారి పాట’.. పవన్ – క్రిష్ ‘హరిహర వీరమల్లు’ చిత్రాలు బాక్సాఫీస్ రేసుకి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అఫీషియల్ గా ఈ రెండు మూవీస్ సంక్రాంతి కి కన్ఫమ్ అయ్యాయి.
పవన్-మహేశ్ సినిమాలతో పాటు.. టాలీవుడ్ లోని మరో రెండు చిత్రాలు కూడా సంక్రాంతి వైపే చూస్తున్నాయట. వాటిలో ‘ఎఫ్-2’ సీక్వెల్ ‘ఎఫ్-3’ ఒకటి. వెంకటేశ్ – వరుణ్ తేజ్ కాంబోలో రాబోతున్న ఈ ఫన్ మూవీని ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే.. కోవిడ్ సెకండ్ వేవ్ వలన ఈ సినిమా షూటింగ్ లేటయ్యింది. దాంతో.. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. గతంలో ‘ఎఫ్-2’ చిత్రం కూడా సంక్రాంతి బరిలోనే రిలీజయ్యింది.
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఇంకా మొదలవ్వలేదు. త్వరలో థర్డ్ వేవ్ అనే భయం కూడా ఉంది. ఈనేపథ్యంలో.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన ‘రాధేశ్యామ్’ సినిమాని.. సంక్రాంతి బరిలో తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడట. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజయ్యే ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంక్రాంతి స్లాట్ బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు వంటి కథానాయకులు.. ఐశ్వర్యరాయ్, త్రిష, అదితిరావు హైదరీ, ఐశ్వర్య లక్ష్మి వంటి కథానాయికలతో.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజున్న ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘పొన్నియిన్ సెల్వన్’ పొంగల్ ని టార్గెట్ చేసిందట.
ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘మాస్టర్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు విజయ్. ‘మాస్టర్’ తర్వాత ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ మూవీ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ ప్రెస్టేజియస్ గా నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే కథానాయిక. ‘మాస్టర్’ తర్వాత మరోసారి ఈ మూవీతో మ్యూజికల్ మేనియా సృష్టించడానికి రెడీ అవుతున్నాడు అనిరుధ్. ప్రస్తుతం ‘బీస్ట్’ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రం 2022 పొంగల్ ని టార్గెట్ చేసింది. మొత్తంమీద.. వచ్చే సంక్రాంతి బరిలో ఏఏ చిత్రాలు సత్తా చాటుతాయో చూడాలి.