ఒక్కసారిగా బరువు తగ్గవచ్చని… షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులను మందులు లేకుండానే పూర్తిగా నయం చేయవచ్చంటూ గతంలో సోషల్ మీడియాను షేక్ చేసిన పేరు ‘వీఆర్కే డైట్’! తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వందలాది కిలోల బరువు తగ్గామని చెప్పే ప్రచారాలు, ఆకర్షణీయమైన డైట్ ప్లాన్లతో వీరమాచనేని రామకృష్ణ ఇటు సాధారణ ప్రజలను, అటు సెలబ్రిటీలను కూడా విపరీతంగా ఆకట్టుకున్నారు.
అసలు ఇంతకీ ఏంటీ వీఆర్కే డైట్ ప్లాన్? ఇందులో ఆయన ఏం చెబుతారు? కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేసి, కొవ్వు పదార్థాలు , ప్రొటీన్లు అధికంగా తీసుకోవాలని, నీళ్లు విపరీతంగా తాగాలని ఆయన సూచించేవారు. షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుతున్న టాబ్లెట్లు, ముఖ్యంగా ఇన్సులిన్‌ను ఆపేయవచ్చని ఆయన ప్రచారం చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. అయితే, ఇదే డైట్ ప్లాన్ ఇప్పుడు ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఏకంగా వీరమాచనేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసే వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది..
నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల కల్లెడ సాయికృష్ణ వృత్తిరీత్యా లా విద్యార్థి. అయితే అతను గత కొంతకాలంగా ‘టైప్-1 డయాబెటిస్’తో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో సాయికృష్ణ సోషల్ మీడియాలో వీరమాచనేని రామకృష్ణకు సంబంధించిన వీడియోలు చూశారు. ‘వీఆర్కే డైట్ పాటిస్తే షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది, ఇన్సులిన్ అవసరమే ఉండదు’ అనే ప్రచారాన్ని ఆయన గుడ్డిగా నమ్మాడు. తన ప్రాణాలపై ఉన్న బెంగతో, వ్యాధి నుంచి విముక్తి పొందాలన్న ఆశతో హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఉన్న వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్‌ను నేరుగా సంప్రదించాడు. ఆ సెంటర్‌కు వెళ్లిన సాయికృష్ణను వీరమాచనేని రామకృష్ణతో పాటు ఆయన సహాయకుడు కోటేశ్వరరావు స్వయంగా పరీక్షించారు. బాధితుడి నుంచి ఫీజు కింద ఏకంగా రూ. 26 వేలు తీసుకున్న తెలుస్తుంది.. ఇక ఆ తర్వాత వారు ఇచ్చిన సలహా సాయికృష్ణ జీవితాన్ని తలకిందులు చేసింది. ‘ఇక నుంచి నువ్వు ఎలాంటి ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, పూర్తిగా ఆపేయి’ అంటూ అతనికి ఒక డైట్ ప్లాన్ రాసిచ్చారు.
దీంతో వీరమాచనేని అండ్ టీమ్ చెప్పిన మాటలను నమ్మిన సాయికృష్ణ… తాను రెగ్యులర్‌గా వాడుతున్న ఇన్సులిన్‌ను పూర్తిగా నిలిపివేశాడు. వారు చెప్పిన డైట్ ప్లాన్ ఫాలో అవ్వడం ప్రారంభించాడు. సరిగ్గా ఇక్కడే అసలు ప్రమాదం ముంచుకొచ్చింది. వారు సలహా పాటించిన కేవలం రెండు రోజులకే సాయికృష్ణ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఒళ్లంతా తిమ్మిర్లు, తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో కుప్పకూలిపోయాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు అతన్ని సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సాయికృష్ణను పరిశీలించి వైద్యులు షాకయ్యారు. ఇన్సులిన్ ఆపవేయడం వల్ల ఆయన శరీరంలో డెడ్లీ కండిషన్ అయిన ‘డయాబెటిక్ కీటోఎసిడోసిస్’తీవ్ర స్థాయికి చేరుకుందని నిర్ధారించారు. దానితో పాటు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురికావడంతో, సాయికృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా మారింది..
ఇక ఆసుపత్రి నుంచి కోలుకున్న తర్వాత బాధితుడు సాయికృష్ణ తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయడం మొదలుపెట్టాడు.తన ప్రాణాలతో చెలగాటమాడిన వీరమాచనేని రామకృష్ణ, ఆయన సహాయకుడు కోటేశ్వరరావుపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వీరమాచనేని రామకృష్ణ, కోటేశ్వరరావుపై చీటింగ్ , ప్రాణాలకు హాని కలిగించడం, నేరపూరిత కుట్ర వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అనధికారిక వైద్య సలహాలు, డైట్ ప్రచారాలను గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
